జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల విధులు కత్తిమీద సాములా మారాయి. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అలసత్వం పేరుతో అధికారుల ఆదేశాలు పంచాయతీ కార్యదర్శుల పాలిట శాపంగా మారాయి. గత నెలలో చెత్త సేకరించే ట్రాక్టర్లో డీజిల్ పోయించడానికి ఫరూఖ్‌నగర్ మండలంలోని ఓ గ్రామపంచాయతీకి చెందిన కార్యదర్శి వద్ద డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులు చందా చేసుకుని డీజిల్ పోయించుకున్నారు.
దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అలాగే, కందుకూరు మండలంలోని మరో పంచాయతీ కార్యదర్శి ఓటరు లిస్టు సరిగ్గా నిర్వహించలేదని సస్పెన్షన్ వేటు వేశారు. ఉన్న పనులతోనే సతమతమవుతున్న కార్యదర్శులపై సర్కారు అదనపు భారం మోపుతుండటంతో విధిలేని పరిస్థితిలో చేసిన చిన్న తప్పులను కూడా అధికారులు సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు గ్రామపంచాయతీల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. పన్నులు వసూలు చేసి ట్రెజరీల్లో జమచేసినప్పటికీ సర్కారు ట్రెజరీల ద్వారా చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ట్రాక్టర్లలో డీజిల్, వీధిదీపాల ఏర్పాటు, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ వంటి సరఫరా కూడా చేయకపోవడంతో కార్యదర్శులే అప్పులు చేసి వీటికి డబ్బులు చెల్లిస్తున్నారు. కాని, ప్రభుత్వం మాత్రం చేసిన అప్పులకు చెల్లింపులు లేకపోవడంతో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనోవేదనకూ లోనవుతున్నారు.
– రంగారెడ్డి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)
ఆమనగల్లు మండలంలోని సింగంపల్లి, ఫరూఖ్‌నగర్ మండలంలోని బీమారం గ్రామాలకు చెందిన కార్యదర్శులను రెండు రోజుల క్రితం కలెక్టర్ సస్పెండ్ చేశారు. గ్రామపంచాయతీకి సకాలంలో వెళ్లినా హాజరు వేయకుండా తప్పుడు ఫొటోలతో హాజరులో ఫొటోలు నమోదు చేశారన్న కారణంతో సస్పెండ్ చేశారు. సర్కారు ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టంలో భాగంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టం ఆప్‌లో హాజరు వేయాల్సి ఉంటుంది. కాని, కొంతమంది కార్యదర్శులు ఈ సిస్టంను పాటించకుండా ఇతరుల ఫొటోలను పంపించి హాజరు వేయించారని అధికారులు గుర్తించారు.
ఈమేరకు ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేయడంతోపాటు మరో 8 మందిపై చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధం చేశారు. మరోవైపు జిల్లాలో 40 మంది పంచాయతీ కార్యదర్శులు అదనంగా ఇతర పంచాయతీలకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు కూడా రెండు పంచాయతీల వద్దకు వెళ్లి హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. అదనపు బాధ్యతలతో కూడా వీరు సకాలంలో వెళ్లలేకపోతున్నట్లు కార్యదర్శులు వాపోతున్నారు.
గ్రామపంచాయతీలకు గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సర్కారు ఒక్కపైసా కూడా చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులే అప్పులు చేసి గ్రామపంచాయతీల నిర్వహణ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లో డీజిల్ పోయించడం, పాడైన వీధి దీపాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయడం, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ వంటి వాటిని కొనుగోలు చేయడం, ఆయా గ్రామాల్లో బోనాలు, ఇతరత్రా ఉత్సవాలకు డబ్బులు ఇవ్వడం వంటివి కార్యదర్శులే చేస్తున్నారు.
అప్పులు చేసి ఖర్చుపెడుతున్నప్పటికీ బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. మరోవైపు కార్యదర్శులు ఇంటి పన్నులు వసూలు చేసి జీపీల్లో జమచేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా పన్నుల నుంచి వచ్చే పన్ను కూడా ట్రెజరీల్లో జవుతున్నది. ట్రెజరీల్లో డబ్బులు జరుపుతున్నప్పటికీ చెల్లింపులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. దీంతో కార్యదర్శులు సంవత్సర కాలంగా అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
526 గ్రామపంచాయతీలకుగానూ 458 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. వీరిలో 40 మందికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరిలో గ్రేడ్-1 కార్యదర్శులు 57, గ్రేడ్-2 19 మంది, గ్రేడ్-3 70 మంది, గ్రేడ్-4 264 మంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 46 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్వహణ ప్రక్రియ, ఎన్నికల విధులు, కులగణన, ఓటర్ లిస్టుల నిర్వహణతోపాటు గ్రామపంచాయతీల్లో చెత్త సేకరణ, ట్రాక్టర్లు, వీధిదీపాల నిర్వహణ వంటి గ్రామానికి సంబంధించిన అన్ని పనులు వీరిపైనే ఉంటాయి. ఈ పనుల్లో ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేసినా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కార్యదర్శుల పని కత్తిమీద సాములా మారింది.