షాబాద్, జూలై 12 : రాష్ట్రంలో ఆడబిడ్డలను కోళ్లను కోసినట్టు కొస్తుంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. షాబాద్ ఘటనకు కారణం ము మ్మాటికీ పోలీసుశాఖ నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం బాధిత బాలిక సోదరి దివ్యాంగురాలైన మేఘనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని కుటుంబసభ్యులు, బంధువులను ఓదార్చారు. ఈ సం దర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ..షాబాద్‌లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. దివ్యాంగురాలైన యువతిని చూస్తుంటే మనసు కలిచివేస్తున్నదని.. ఆమె ఇతరుల సహకారం లేకుండా జీవించలేదన్నారు. ఆమె కండ్ల ముందే చెల్లెలు, అమ్మ, నాన్నమ్మలను అతి కిరాతకంగా నిందితుడు రాజ్‌కుమార్ హత్య చేశాడని.. ఏమి జరిగిందని అడిగితే వాళ్ల అమ్మ ను ఏట్ల పొడిచాడో సైగ చేసి చెబుతుందన్నారు.
నిందితుడు ముగ్గురు మహిళలను కిరాతకంగా హత్య చేయడం ఎంతో బాధాకరమని.. దీనికి కారణం పోలీసుశాఖ, ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు, నీ భర్తను చంపినట్టు మీ కుటుంబం మొత్తాన్ని చంపుతానని హెచ్చరించినప్పుడు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆ రోజే నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయేవా అని మండిపడ్డారు. హోంశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిలయ్యారని.. వెంటనే ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారు కానీ, నలుగురు ఆడబిడ్డలను కోళ్లను కోసినట్టు కొస్తే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నీ ఇలాకాలో, నీ జిల్లాలో, మీరు ఈ ప్రాంతానికి వచ్చివెళ్లిన రెండు రోజులకే ఈ ఘటన జరిగినా కనీసం మానవత్వంతోనైనా స్పందించారా? అని దుయ్యబట్టారు. ఆయనకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టేందుకు ఉన్న తీరిక, సమయం.. ఓ కిరాతకుడు ఆరుగురిని దారుణంగా హత్య చేస్తే మాట్లాడేందుకు మాత్రం టైం ఉండదని ఎద్దే వా చేశారు.
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దాదాపుగా 55 రోజులు దాటినా అతడిని ఎందుకు అరెస్టు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పోక్సో కేసులు నమోదు అవుతున్నాయని.. హోంశాఖను తన వద్దే ఉంచుకుని రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రివ్యూ చేసి దానికి గల కారణాలను తెలుసుకోరా? అని మండిపడ్డారు. పోక్సో కేసు నిందితులపై ఆయనకు అంత ప్రేమ ఎందుకో అని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోని ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. షాబాద్‌లో జరిగిన ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిట్‌చాట్‌లో స్పందించారని, మరి ఇక్కడున్న సీఎంకు ఏమైందని ప్రశ్నించారు. హోంమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆమె పేర్కొన్నారు. ఆరుగురిని హత్య చేసిన నిందితుడ్ని ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు.. కానీ, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు మాత్రం ఎస్వోటీ పోలీసులను ఎక్కడికక్కడ పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడే నిందితుడ్ని అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు ఇంత దారుణం జరిగేది కాదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని.. దివ్యాంగురాలు పేరున కోటి రూపా యలు వెంటనే డిపాజిట్ చేయాలన్నారు. ఇందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేశమళ్ల ఆంజనేయులు, చల్లా శేఖర్‌రెడ్డి, జడల రాజేందర్‌గౌడ్, పోన్న నర్సింహారెడ్డి, ప్రభాకర్, మండల పార్టీ నాయకులు వెంకట్‌యాదవ్, మధుకర్‌రెడ్డి, సురేశ్‌గౌడ్, కృష్ణారెడ్డి, దేవేందర్‌రెడ్డి, చెన్నయ్య, శ్రీశైలంయాదవ్, మం గలి సత్యం, కృష్ణగౌడ్, శ్రీనివాస్, మద్దూరి పాండు, హరీఫ్, ఇమ్రాన్, శ్రీనివాస్, వెంకటయ్య, జంగయ్య, మల్లేశ్, భీమ్లానాయక్, రాందేవ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, షాబాద్‌లో హత్యకు గురైన బాధిత కుటుంబానికి షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అండగా నిలిచారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా దివ్యాంగురాలైన మేఘనకు తనవంతు సాయంగా రూ. 5 లక్షల చెక్కును ఇప్పించారు.