వికారాబాద్, ఏప్రిల్ 28: గతంలో వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు కొందరు రైతులు. ఆరు గాలం కష్టపడి పండించినా తక్కువ ఆదాయం వచ్చేది. గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులు, ఉద్యానవనశాఖ అధికారులు అవగాహనలు కల్పించారు. దీంతో వారి సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు సాగు చేసిన రైతులు లాభాలు తప్ప, నష్టాలు అనే మాటే మరిచారు. వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో 70 నుంచి 80 శాతం వరకు రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. మండలంలో నారాయణపూర్‌కు కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా మారింది. 500 ఎకరాల వరకు రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి.
బోరు, బావుల నీటిని వినియోగించుకుంటూ సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారు. డ్రిప్ సాయంతో రైతులు అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరల పంటలు సాగు చేస్తున్నారు. పంటలను వాహనాల ద్వారా ప్రతి రోజు హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. పనితోపాటు ప్రతిరోజు చేతి నిండా ఆదాయం వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదిస్తున్నారు.
పండ్ల తోటలు, కూరగాయల సాగు ..
గ్రామంలో 15ఎకరాల్లో జామ, మరో 15 ఎకరాల్లో మామిడి పండ్ల తోటలు రైతులు సాగు చేస్తున్నారు. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, టమాట, బీరకాయ, సొరకాయ, మిర్చి, బీట్రూట్, బెండకాయ, దొండకాయ, చిక్కుడు కూరగాయలతోపాటు వివిధ రకాల ఆకు కూరలు సైతం సాగు చేస్తున్నారు. వీటిని ప్రతిరోజూ ఉదయం వాహనాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తారు.
గ్రామంలోనే ఉపాధి…
రైతులు కూరగాయల సాగు చేయడం ద్వారా నిత్యం పనులు దొరుకుతున్నాయి. ప్రతి రోజూ కూరగాయలను తెంపడం, శుభ్రం చేయడం, బస్తాల్లో నింపడం వంటి పనులు చేయడంలో కూలీలు అధికంగా అవసరం ఉంటారు. 500 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయడంతో నిత్యం పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఒక పక్క నారు వేయడం, మరో పక్క పంటలు తీయడంలో రైతులు బీజీబీజీగా ఉండిపోతున్నారు.
డ్రిప్ సాయంతో సాగు
డ్రిప్ సాయంతో కూరగాయలను సాగు చేస్తున్నాం. దీని ద్వారా నీరు వృథా కాకుండా తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుపై ఆసక్తి పెరగడంతో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాం. కుటుంబ సభ్యులతోపాటు ఇతరుల సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. గ్రామంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తుంటారు. వీటిని నిత్యం హైదరాబాద్‌కు తరలిస్తారు.
– మమత, రైతు, నారాయణపూర్, వికారాబాద్
వివిధ రకాల కూరగాయల సాగు
నాకు 20 ఎకరాల పొలం ఉన్నది. ఇందులో వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తాము. పొలం పనులు చేయడంతోపాటు ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. వివిధ యంత్రాల సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. సొరకాయ, బీరకాయ, క్యారెట్ తదితర రకాల కూరగాయలను సాగు చేశాం. తీసిన కూరగాయలను బస్తాలో నింపి ప్రతిరోజూ వాహనాల ద్వారా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు తరలిస్తాం. మూడు నెలల పంట కావడంతో సంవత్సరానికి మూడు సార్లు పంటలు తీసే అవకాశం ఉంటుంది.
– సుభాన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, నారాయణపూర్, వికారాబాద్
ఎంతో మందికి ఉపాధి..
గ్రామంలో ఎక్కువ మంది కూరగాయలు సాగు చేయడంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. కూరగాయల పంటలు సాగు చేస్తే నిత్యం పనులు దొరుకుతాయి. కూరగాయలు సాగులో కూలీల ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పంటలను వేసే అవకాశాలు ఉన్నాయి. డ్రిప్ సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. ప్రస్తుతం క్యారెట్, మిర్చి తదితర పంటలు పండిస్తుండటంతో చేతి నిండా పని దొరుకుతుంది. లాభాలు తప్ప నష్టాలు రావు.
– సుభాన్‌రెడ్డి, రైతు, నారాయణపూర్, వికారాబాద్
సర్పంచ్ చెప్పినట్లు చేస్తున్నా
పల్లె ప్రకృతి వనంలో పెరుగుతున్న మొక్కలకు రోజూ నీళ్లు పడుతున్న. దీంతో నాకు ఉపాధి దొరుకుతున్నది. ప్రకృతి వనంలో ఏమైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే మా సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తా. అతను పంచాయతీ కార్యదర్శికి చెప్పి సమస్యను పరిష్కరింపజేస్తారు. కూలీ డబ్బులు మాత్రం నా అకౌంట్లోకి వస్తాయి. నర్సరీలోనూ నేనే నీళ్లు పోస్తా. అక్కడ కొద్ది సమయం, ఇక్కడ కొద్ది సమయం తీసుకుని నీళ్లు పోసి వాటి చుట్టు పక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తా. మొక్కలు ఏపుగా పెరగడం నాకు చాలా సంతోషంగా ఉన్నది.
– లక్ష్మి, కూలి
మొక్కల సంరక్షణే లక్ష్యం
పల్లె ప్రకృతి వనంలో మొక్కలను వృక్షాలుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి మొక్కను జాగ్రత్తగా చూసుకుంటూ వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకుంటున్నాం. మా పంచాయతీ సిబ్బంది బాగా సహకరిస్తున్నారు. అందుకే పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారుతున్నాయి. వాటిలో పనిచేసే కూలీలు కూడా కలుపు మొక్కలను తీస్తూ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మండలంలోనే కాదు మా గ్రామం రాష్ర్టంలో ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నా
– రావుగారి వెంకట్ రెడ్డి, యెల్లకొండ సర్పంచ్
అధికారుల సూచన మేరకు చర్యలు
మండల అభివృద్ధి అధికారి సూచనల మేరకు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా. సర్పంచ్ సహకారంతో పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను పంచాయతీ సిబ్బందితో కలిసి పని చేస్తున్నా. వేసవి కాబట్టి మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మొక్కలను వృక్షాలుగా మార్చడానికి కృషి చేస్తున్నా. పంచాయతీ సిబ్బందితో నా బాధ్యతగా రోజూ మొక్కలకు నీళ్లు పోయిస్తూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నా.
– లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి