VivekSinha | రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) నేడు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌లో ఉగ్రవాది జహూర్ మిస్త్రీ పాత్ర పోషించిన నటుడు వివేక్ సిన్హాకు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. సినిమాలో ఆయన చెప్పిన ఒక వివాదాస్పద డైలాగ్ (‘హిందూ ఏక్ దర్పోక్ కౌమ్ హై’ – హిందువులు పిరికివారు) నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ డైలాగ్ విన్న చాలామంది ఆయన్ని నిజమైన ఉగ్రవాదిగా భావిస్తూ, ‘పాకిస్థాన్‌కు వచ్చి మరీ నిన్ను చంపేస్తాం’ అంటూ సందేశాలు పంపుతున్నారు. ఈ పరిణామాలపై వివేక్ సిన్హా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
తనకు వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోయానని, అయితే ఆ కోపం వెనుక ఉన్న దేశభక్తిని తాను గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. “ప్రజలు నన్ను అంతగా ద్వేషిస్తున్నారంటే నా నటన వారికి అంత బాగా నచ్చిందని అర్థం. కానీ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.. నేను పాకిస్థానీని కాదు, ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ నివాసిని. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను” అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కేవలం తన పాత్రకు న్యాయం చేసేందుకే ఆ డైలాగ్స్ చెప్పానని, తెరపై కనిపించే పాత్రలకు, నిజ జీవితానికి సంబంధం ఉండదని ఆయన గుర్తుచేశారు.