– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 07 : ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, అది ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉండాలి. మానవ వనరులే అత్యంత విలువైన సంపద. యువశక్తిని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల పరిస్థితి, ఐటీ రంగం, పెట్టుబడులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం క్షీణతపై భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ రంగంలో కేవలం 3–4 శాతం మందికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, మిగిలిన యువతకు ఉపాధి కల్పించేది ప్రైవేట్ రంగమే. ఈ వాస్తవాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
పెట్టుబడులకు అవసరమయ్యేలా 24 గంటల నాణ్యమైన విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, ఫ్లైఓవర్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలతో హైదరాబాద్‌ను పెట్టుబడిదారులకు విశ్వసనీయ నగరంగా కేసీఆర్ మార్చారు. షీ టీమ్స్, సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ ద్వారా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్-ఐపాస్‌తో పరిశ్రమలకు స్వర్ణయుగం. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించారు. టీ-హబ్, వి-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థల ద్వారా స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించారు. దీని ఫలితంగా తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో అగ్రస్థానానికి చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ కు ఉన్న పరిచయాలు, అవగాహనతో “బ్రాండ్ తెలంగాణ– బ్రాండ్ హైదరాబాద్”ను కేటీఆర్ నిర్మించారు. తత్ఫలితంగా గూగుల్, మెటా, క్వాల్కమ్, ఊబర్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రపంచ ప్రముఖ కంపెనీల రెండో అతిపెద్ద క్యాంపస్‌లకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందన్నారు. 2014లో 2.90 లక్షల ఐటీ ఉద్యోగులు ఉండగా, కేసీఆర్–కేటీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఆ సంఖ్య 9.46 లక్షలకు పెరిగింది. ఐటీతో పాటు రిటైల్, రియల్ ఎస్టేట్, నిర్మాణ, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు తెలిపారు.
రేవంత్ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పెట్టుబడుల పరంగా వెనక్కి వెళ్లిందని విమర్శించారు. హైడ్రా, మూసీ కూల్చివేతలు, రియల్ ఎస్టేట్‌పై అనిశ్చితి, వ్యాపారులపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారుల్లో భయం ఏర్పడిందన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని ప్రభుత్వం స్వయంగా ప్రచారం చేయడం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నారు. టీఎస్-ఐపాస్‌ను బైపాస్ చేసి “బ్రదర్స్ పాస్”గా మార్చారన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ భూ దందాలు పెరిగి, రైతులు మోసపోతున్నారని విమర్శించారు. ఎల్ అండ్ టీ, ఫార్ములా-ఈ వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి పెట్టుబడిదారులకు ప్రతికూల సంకేతాలు ఇస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావడం కష్టమన్నారు.
ఒకప్పుడు 2 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగులను 10 లక్షలకు పెంచితే ప్రస్తుతం రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో 2023 లో 9.46 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే, 2026 కల్లా 9.39 లక్షలు అయ్యారని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారన్నారు. కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నట్లు తెలిపారు. ఫాక్స్‌కాన్, కైటెక్స్ వంటి సంస్థలను కేటీఆర్ తీసుకొస్తే, ఇప్పుడు ప్రభుత్వ వైఖరి కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని ఆరోపించారు. గూగుల్ ఏఐ క్యాంపస్ వంటి భారీ పెట్టుబడులు కూడా తెలంగాణను వదిలి వైజాక్ కు తరలివెళ్లిపోయాయన్నారు.
వెనుకబడిన తెలంగాణను దేశంలో పెట్టుబడులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తలసరి ఆదాయంలో అగ్రస్థానానికి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. 2014లో రూ.1.12 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2023 నాటికి రూ.3.47 లక్షలకు చేరిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.14.5 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, రైతుబంధు, పీఆర్సీ, డీఏలు, గురుకులాలు… ప్రతి రంగంలో నిధుల కొరత ఉందన్నారు. చాక్‌పీస్‌లు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టించడం లేదన్నారు.
ప్రతి ఏడాది సుమారు 1.20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే స్పష్టమైన కార్యాచరణ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు, కొల్పుల అమరేందర్, భువనగిరి పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏవీ కిరణ్, టౌన్ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ రమేశ్, మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ కౌన్సిలర్ గోపాల్, మాజీ ఎంపీటీసీ అబ్బగాని వెంకట్, వలిగొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ మమతారెడ్డి, భువనగిరి పట్టణ కౌన్సిలర్లు నాగు, రాజు, సంతోష్, చిన్నప్ప, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.