Dhurandhar 2 | బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గతేడాది సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే హిందీ వెర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, దక్షిణాది ప్రేక్షకులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు నిరాశ ఎదురైంది. సినిమా విడుదలైన తొలి షో నుంచే ‘ధురంధర్ 2’కు పాజిటివ్ టాక్ వచ్చింది. రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉందని సినీ విమర్శకులు ప్రశంసిస్తున్నారు.
ఇక సినిమాలో కీలక పాత్రల్లో నటించిన మాధవన్, సంజయ్ దత్ తమ నటనతో సినిమాకు మరింత బలం చేకూర్చారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. “దేశభక్తిని చాలా స్టైలిష్‌గా చూపించారు… ప్యాట్రియాటిసం విత్ స్వాగ్ ” అంటూ ఆయన చేసిన కామెంట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో భారీగా విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. డబ్బింగ్ పనులు ఆఖరి నిమిషం వరకు కొనసాగడం వల్ల కంటెంట్ డెలివరీలో జాప్యం ఏర్పడింది. దీనివల్ల బుధవారం రాత్రి పడాల్సిన పెయిడ్ ప్రీమియర్ షోలు కూడా రద్దు అయ్యాయి.
ఇక సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని మార్పుల కారణంగా చివరి నిమిషంలో కొన్ని సీన్లను ఎడిట్ చేయాల్సి వచ్చింది. దీంతో డబ్బింగ్ ఫైల్స్ మిక్సింగ్‌లో సమస్యలు ఏర్పడి డిజిటల్ ప్రింట్లు థియేటర్లకు చేరడంలో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో హిందీ వెర్షన్‌ను మాత్రమే సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శిస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ ఇస్తున్నాయి. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చిత్రబృందం వేగంగా పని చేస్తోంది. డిజిటల్ ప్రింట్లు థియేటర్లకు చేరే ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. అన్ని సమస్యలు పరిష్కారమైతే శుక్రవారం నుంచి తెలుగు వెర్షన్ షోలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.