గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో 23% నుంచి 42 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామని హామీనిస్తూ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించి.. బీసీల ఓట్లను కొల్లగొట్టింది. అయితే, పవర్లోకి వచ్చిన తర్వాత కులగణన పేరిట బీసీల గొంతు నొక్కింది. పదేండ్ల తర్వాత కూడా తెలంగాణలో బీసీల జనాభాను లక్షల్లో తగ్గిస్తూ లెక్కలు చూపడంతో బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతు న్నాయి. కుల గణన ఓ తప్పుల తడక అంటూ నివేదికను చించివేయడంతోపాటు రాను న్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీసీల పై కుట్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన కుల గణనపై బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్‌పటేల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ…
-వికారాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ)
అసెంబ్లీలో కేవలం ప్రకటనే చేశారు..
అసెంబ్లీలో బిల్లు తెస్తారు, చట్టం చేస్తారేమోనని అనుకోగా.. కేవలం ప్రకటన మాత్రమే చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు బీసీల రిజర్వేషన్లను పెంచే ఉద్దేశమే లేదు. బీసీల ఓట్లతో గెలిచిన ఆ పార్టీ 14 నెలల కాలంలో అన్ని వర్గాలనూ మోసం చేసింది. కమిషన్ ఆధారంగా కులగణన చేయాలని బీసీ సంఘాలు ముందు నుంచే మొత్తుకోగా.. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టారు. మొదట మార్చి 22న జీవో నంబర్ 26 ఇచ్చి దానిని పక్కన బెట్టారు. మళ్లీ ప్లానింగ్ శాఖకు అప్పగిస్తూ జీవోనంబర్ 18 ఇచ్చారు. మొదట్నుంచీ బీసీ సంఘాలు చెబుతున్నదేమంటే బీసీల జనాభా తెలంగాణలో 54 శాతానికిపైగా ఉంటుందని.. గతంలో బీసీ జనాభా 51 శాతమంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు దాన్ని 46 శాతానికి తగ్గించడంతో బీసీ సంఘాలు అభ్యంతరం తెలపడంతోపాటు కులగణన నివేదికను చించివేశాయి. ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, చిరంజీవుల సంఘాలన్నీ కులగణనను వ్యతిరేకిస్తుండడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే కులగణన రిపోర్ట్‌ను తగలబెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్యాయం జరిగిందని, బీసీల లెక్కతేలలేదని బాధపడుతుంటే ఈ రోజు పేనం నుంచి పొయ్యిలో పడినట్లుగా బీసీల పరిస్థితి తయారైంది.
బీసీ జనాభాను 22 లక్షలకు తగ్గించిన సర్కార్..
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా మూడున్నర కోట్లు. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 3.68 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3.54 కోట్లుగా చెబుతున్నది. 16 లక్షల జనాభా అందుబాటులోకి రాలేదు, వలస వెళ్లారంటూ.. సమాచారం ఇచ్చేందుకు సహకరించలేదని చెబుతున్నారు. 2014లో 3.68 కోట్లు ఉన్న జనాభా పదేండ్లలో కేవలం 2,00,000 మాత్రమే పెరుగుతుందా..? అని ప్రభుత్వ లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో బీసీలు 1,85,61,856 (51 శాతం) ఉన్నారు. ఇప్పుడు 1,64,9179 (46.25 శాతం) ఉన్న ట్లు.. అంటే 21,52,677 బీసీల జనాభాను తక్కువగా చూపుతున్నారు. వాస్తవానికి జనాభా వృద్ధి రేటు 1.35 శాతంగా ఉన్నది. వృద్ధి రేటు ప్రకారం చూస్తే తెలంగాణ జనాభా 4 కోట్లు దాటాలి. ఆధార్, రేషన్ కార్డుల ప్రకారం తీసుకున్నా జనాభా 4 కోట్లు దాటాలి.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 3.70 కోట్లుగా చూపుతున్నది. ఎస్సీలను 1.75 లక్షలు, ముస్లింల జనాభాను 1.65 లక్షలకు తగ్గించారు. మరోవైపు ఓసీల జనాభాను మాత్రం గతంతో పోలిస్తే 15,89,955లకు పెంచింది. 2014లో ఓసీల మొత్తం జనాభా 11 శాతం కాగా, ఇప్పుడు 15.79 శాతంగా లెక్కలు చూపుతున్నది. హిందూ ఓసీలు, ముస్లిం ఓసీలు(2.48 శాతం) చూపించి మొత్తంగా ఓసీల జనాభాను 15.79 శాతానికి కాంగ్రెస్ సర్కార్ పెంచింది.
కామారెడ్డి డిక్లరేషన్ ఓ బోగస్..
సామాజిక న్యాయమంటూ రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతూ కులగణన విషయంలో అందరి కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలోనైతే తమ పార్టీ అధికారంలోకి వస్తుందో అక్కడ తాము కులగణన చేపడుతామని, జాతీయ స్థాయిలో అధికారం చేపడితే దేశవ్యాప్తంగా చేస్తామని హామీ నిచ్చారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఆ డిక్లరేషన్ ప్రకారం కులగణన చేపడుతామని, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను 23 నుంచి 42 శాతానికి పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో న్యాయం జరుగాలంటే కులగణన చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీసీ కమిషన్ నుంచి కాంగ్రెస్ సర్కార్‌కు నివేదిక ఇచ్చాం. ఆ నివేదికను బట్టి గతేడాది ఫిబ్రవరిలో కేబినెట్లో ఆమోదించారు.
కులగణన చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న తీర్మానాన్ని అసెంబ్లీలోనూ బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీల మద్దతుతో ప్రవేశపెట్టి గతేడాది ఫిబ్రవరి 16న ఏకగ్రీవంగా ఆమోదించారు. తర్వాత దానిని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో బీసీ సంఘాల డిమాండ్ మేరకు మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒక్కరోజు ముందు జీవోనంబర్ 26ను విడుదల చేసింది. ఎన్నికల తదనంతరం మేలో కులగణనకు సంబంధించి విధివిధానాలను తయారు చేయాలని బీసీ కమిషన్‌కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. దానికి సంబంధించి పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సెస్తోపాటు మేధావులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, మురళీ మనోహర్, పీఎల్ విశ్వేశ్వర్, అకునూరి మురళి, పృథ్వీరాజ్ తదితరులతో బీసీ కమిషన్ సమావేశాలు నిర్వహించింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ తదితర రీసెర్చ్ సంస్థలకు బీసీ కమిషన్ తయారు చేసిన ప్రశ్నలన్నీ పంపి సమాలోచనలు జరిపిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక పంపగా, మూడు నెలలు పక్కనపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలోనే హైకోర్టులో కేసు ఉన్నది.
మూడు నెలల్లో కులగణన పూర్తి చేసి బీసీల రిజర్వేషన్‌ను నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో బీసీ కమిషన్‌కు మరోసారి జీవోనంబర్ 47ను తెచ్చి ఇప్పుడున్న బీసీ కమిషన్‌కు డెడికేటెడ్ కమిషన్‌గా బాధ్యతిచ్చి బీసీల వెనుకబాటుతనాన్ని స్థానిక సంస్థల వారీగా తీసి రికమండేషన్ చేయాలన్నారు. అది ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కలిపి 50 శాతమని ప్రభుత్వం చెప్పింది. కొత్తగా వికాస్ కిషన్‌రావు తీర్పు(మహారాష్ట్ర), 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ రెండు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా మూడు నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని తీర్పునిచ్చింది. డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల వారీగా అధ్యయనం చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశానుసారం బీసీ కమిషన్ కొన్ని జిల్లాల్లో పర్యటించింది, కానీ, బీసీ కమిషన్‌కు అధ్యయనం చేసేందుకు వీలు లేకపోవడంతో.. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మరోసారి ఉత్తర్వులిచ్చింది. అప్పుడు జీవో 49 ద్వారా కొత్తగా పూసాని వెంకటేశ్వర్లు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు సంబంధిత జీవోల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని ప్రభుత్వం జీవోనంబర్లు 47, 49లలో పేర్కొన్నది. కానీ బయట మాత్రం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కట్టుకథలు చెబుతున్నారు. పదేండ్లలో కచ్చితంగా జనాభా పెరుగుతది కానీ బీసీల జనాభాను తగ్గించి ఓసీ జనాభాను పెంచుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..
జనాభా లెక్కలు తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నది. బీసీల స్థితిగతులు మారాలంటే బీసీల జనాభా ఎంత అనేది లెక్క తేలాలి. 1931 నిజాం రాజ్యంలోనే కులగణన జరిగింది. 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పి అప్పటి యూపీఏ-2 ప్రభుత్వం కులగణన చేసినా వివరాలను బయటపెట్టలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులు ఉన్నాయని ఆపేయడంతోపాటు రిపోర్ట్‌ను అధ్యయనం చేసేందుకు కమిటీని వేయగా, రిపోర్ట్ 98.87 శాతం సరిగ్గానే ఉందని పార్లమెంట్‌కు నివేదించినా ఆ రిపోర్ట్‌ను బయటపెట్టమని కేంద్రం చెప్పేసింది. అయితే రాజ్‌నాథ్‌సింగ్ 2018లో హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2021 సెన్సెస్‌లో కులగణన చేస్తామని చెప్పినా ఇప్పటివరకు జరుగలేదు. 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ లెక్కలు బయటపెట్టాలని సుప్రీంకోర్టులో కేసు నడవగా.. బయటపెట్టమని సుప్రీంకోర్టుకే కేంద్రం చెప్పింది. లెక్కలు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ర్టాలు ఏమి చేసినా సర్వేల వరకే. వాటిని సంక్షేమ పథకాల అమలు కోసమే వాడుకుంటాయి. కాంగ్రెస్ పార్టీకి అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేసింది.
రివ్యూ పిటిషన్ వేస్తేనే రిజర్వేషన్ల పెంపు సాధ్యం..
ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి కులగణన స్పష్టంగా చేసి శాస్త్రీయ అధ్యయనం చేసి ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. నిజంగానే బీసీల జనాభా చూపిస్తూ 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తీసివేయాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. దీంతోనే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. కాబట్టి బీసీలంతా రానున్న ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.