జూలూరుపాడు, ఫిబ్రవరి 24 : యాసంగి పంటలు వేసి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు రైతు భరోసా విడుదల చేయకపోవడం అంటే రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. యాసంగి వరి నాట్లు పూర్తి అయి రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా భరోసా నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, రూ. 2 లక్షల రుణమాఫీ సైతం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.