బొంరాస్‌పేట, ఆగస్టు 24: రైతులు వానకాలంలో సాగు చేసిన పెసర పంట ఆశాజనకంగా ఉన్నది. పప్పు దినుసుల పంటలో ప్రధానంగా చెప్పబడే పెసరను వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానకాల పంటగా సాగు చేశారు. యాసంగిలో బోర్ల కింద ఈ పంటను తక్కువ విస్తీర్ణంలో సాగు చేయగా.. వర్షాధారంగా మెట్ట పొలాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేశారు. మృగశిర కార్తె తర్వాత వర్షాలు కురువడంతో రైతులు పెసర విత్తనాలను వేయగా.. ప్రస్తుతం పంట కోత దశకు చేరింది. ఈ పంట కాలం 60 నుంచి 75 రోజులు. జూన్‌లో విత్తనాలు వేస్తే ఆగస్టు చివరి మా సంలో కోతలు ప్రారంభమవుతాయి.
సాధారణంగా పెసర పంట వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లు, ముసురు వానలకు దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తుంది. కాగా ఈ ఏడాది ఈ పంటకు సమృద్ధిగా వర్షాలు కురువడంతోపాటు తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి ఆశించిన మేర వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ పెసరకు రూ.6 నుంచి రూ. 7 వేల వరకు ధర పలుకుతున్నది. వానకాలంలో సాగుచేసిన మొక్కజొన్న, మినుములు, జొన్న తదితర పంటలు కూడా ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి.
జిల్లాలో 12,961 ఎకరాల్లో సాగు
వికారాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలంలో రైతులు పెసర పంటను 12,961 ఎకరాల్లో సాగు చేశారు. కొడంగల్ డివిజన్లోని బొంరాస్‌పేట, తాండూరు డివిజన్లోని బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాల్లో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. బొంరాస్‌పేటలో 3,347 ఎకరాల్లో, దౌల్తాబాద్‌లో 326, కొడంగల్‌లో 678, దోమలో 602, చౌడాపూర్‌లో 5, కులకచర్లలో 2, పరిగిలో 35, బషీరాబాద్‌లో 2,528, పెద్ద్దేముల్లో 1,249, తాండూరులో 3,350, యాలాలలో 84, బంట్వారంలో 50, ధారూరులో 231, కోట్‌పల్లిలో 65, మర్పల్లిలో 271, మోమిన్‌పేటలో 15, వికారాబాద్‌లో 15 ఎకరాల్లో పెసర పంట సాగైంది.