వికారాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాల రాకతో వికారాబాద్ జిల్లాలో తొలకరి వర్షం పలుకరించింది. గత నాలుగైదు రోజులుగా పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసిన రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఓ మోస్తరు వర్షం మాత్రమే కురిసింది కాబట్టి ఇప్పుడే ఎవరూ విత్తనాలను నాటవద్దని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
భూమిలో సరిపోను పదునుంటేనే విత్తనాలు నాటాలని, సరైన పదును లేనట్లయితే మొలకెత్తిన విత్తనాలు కూడా ఎండిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా 60 నుంచి 70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలను నాటితే నాటిన ప్రతీ విత్తనం మొలకెత్తే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు తొందరపడి మోస్తరు వర్షానికే విత్తనాలను నాటవద్దని జిల్లా వ్యవసాయాధికారులు ఊరూరా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో వానకాలం సీజన్లో 5.89 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. సరిపోను ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. ఏ ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాల బారిన పడి ఎంతో కొంత మంది రైతులు నష్టపోతున్న దృష్ట్యా ఈ ఏడాది ఏ ఒక్క రైతూ నష్టపోవద్దని పక్కా నిఘా పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి మండలానికి ఒక టాస్క్ఫోర్స్ బృందాన్ని నియమించారు. మండల వ్యవసాయాధికారితోపాటు తహసీల్దార్, ఎస్ఐలతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయగా, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు.
నకిలీ విత్తనాలపై జిల్లా రైతాంగానికి కూడా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేకంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టి, అన్ని దుకాణాల్లోనూ ప్రతిరోజూ తనిఖీలు చేస్తూ నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్ పెట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా టాస్క్ఫోర్స్ తనిఖీల్లో భాగంగా ఇటీవల జిల్లాలో 6.7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్ చేశారు.
జిల్లా రైతులెవరూ తొందరపడి ఇప్పుడే విత్తనాలను వేయొద్దు. నేలలో సరిపోను తేమ శాతం వచ్చిన తర్వాతనే విత్తనాలను నాటాలి. మరో ఒకట్రెండు మంచి వానలు కురిసిన అనంతరమే విత్తనాలను నాటాలి. ఒకవేళ ఇప్పుడే విత్తనాలను నాటితే విత్తనాలు మొలకెత్తవు. మళ్లీ విత్తనాలను నాటాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సీజన్లో సాగు చేసే పంటలకు సరిపడా ఎరువులు, విత్తనాలను జిల్లాలో అందుబాటులో ఉంచాం.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయాధికారి