సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ఏ పని తలపెట్టినా ఉద్యమంలా ముందుకెళ్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గ్రామంలోని పీవీ నర్సింహారావు మెడిసినల్ గార్డెన్లో ఔషధ హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాడు దేశానికి పీవీ నర్సింహారావు దారి చూపారని, నేడు తెలంగాణకు సీఎం కేసీఆర్ తోవ చూపుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అమెరికాలో సైతం ప్రభుత్వ నర్సరీలు, పార్కులు లేవన్నారు.
మొయినాబాద్, ఆగస్టు15 : తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించడం.. పది తరాల వారికి అటవీ సంపదను అందించాలనే ఆలోచన, గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం అనేది చాలా గొప్ప అంశమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలో ఉన్న పీవీ నర్సింహారావు మెడిసినల్ గార్డెన్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం స్వామి రామానందతీర్థ మెమోరియల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఔషధ హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. మెడిసినల్ గార్డెన్లో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సురభివాణీదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, తోలుకట్టా జిల్లా పరిషత్ పాఠశాల, చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులతో కలిసి ఔషధ మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్సీ, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ సురభివాణీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు.
మనిషి అనేవాడు ఈ రోజు ఉంటాడు.. రేపు పోతాడు.. కాని నాటిన మొక్క మాత్రం పది తరాలకు నీడనిచ్చే ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు నీడనిస్తున్నాయన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అంశం చిన్నది కాదని.. చాలా పెద్దదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా ఒక విఫ్లవం.. ఒక ఉద్యమంలా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి మొదలుపెట్టి యజ్ఞంలా చేపట్టి.. ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేశారని పేర్కొన్నారు. ఎలాంటి మొక్కలు కావాలన్నా ప్రభుత్వం ప్రజలు, రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవడానికి ట్రీ గార్డులను కూడా ఏర్పాటు చేశారన్నారు. మొక్కలు పెద్దసంఖ్యలో నాటడంతో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అటవీ శాతం తగ్గుతూ వస్తున్నదని, కానీ తెలంగాణలో క్రమం తప్పకుండా మొక్కలు నాటుకుంటూ పోవడంతో అటవీ ప్రాంతం 6.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విద్యార్థులకు కవిత సూచించారు.
ప్రపంచ అగ్రగామి దేశంగా పేర్కొనబడే అమెరికాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహార విధివిధానాలు ఉండవని కవిత పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు, పార్కులు, డంపింగ్ యార్డులు వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. స్వామి రామానందతీర్థ శిష్యుడైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి బాట చూపితే.. సీఎం కేసీఆర్ తెలంగాణకు తొవ్వ చూపారని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ నర్సింహారావు ఔషధ వనానికి సంబంధించిన భూమి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా మంత్రి సబితారెడ్డి సహకారంతో రక్షించబడిందని.. ఆ ల్యాండ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ధరణిలో నమోదు చేసినట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఇంకా అభివృద్ధి కావలసి ఉందని.. దీనికి సహకరిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీటీసీ రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ రత్నం, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, జిల్లా నాయకుడు గణేష్‌రెడ్డి, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సభ్యుడు శేఖర్, మాజీ సర్పంచ్ సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావడానికి విముఖత చూపిన సందర్భంలో యువతను చైతన్యపరిచి హైదరాబాద్ స్టేట్‌ను ఏర్పాటు చేయడంలో రామానందతీర్థ ప్రముఖ పాత్ర పోషించారని ఎమ్మెల్సీ సురభివాణీదేవి పేర్కొన్నారు. గురువుగారి జ్ఞాపకార్థం పీవీ గారు స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అట్టడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి సమస్యలున్నా ఇన్స్టిట్యూట్ ద్వారా పరిష్కరించడానికి పీవీ కృషి చేసేవారని తెలిపారు. పేద పిల్లలను చేరదీసి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని వారికి దాతల సాయంతో నాణ్యమైన విద్యను అందించేవారని తెలిపారు. మహిళలకు సెల్ప్ డిఫెన్స్ కార్యక్రమాలు నిర్వహించేవారని.. ప్రస్తుతం కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఔషధ గుణాలున్న చెట్ల గురించి భావితరాల వారికి చెప్పాల్సిన అవసరముందని భావించిన పీవీ.. తోలుకట్టాలో ఔషధ వనాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా ఔషధ మొక్కలను నాటాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.