కడ్తాల్, జనవరి 2 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ దవాఖానలు అధ్వానస్థితికి చేరాయని.. రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్-రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్-గంప లక్ష్మయ్యగుప్తా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో కామినేని దవాఖాన వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఉప్పల ట్రస్ట్ అధినేత వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తాతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు.
కేసీఆర్ వైద్య రంగానికి పెద్దపీట వేశారని కొనియాడారు. హైదరాబాద్‌కు నాలుగు దిక్కులా నాలుగు అత్యాధునిక దవాఖానలను నిర్మించేందుకు చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్లె దవాఖానలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కాగా, రేవంత్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో సర్కారు దవాఖానలు అధ్వానస్థితికి చేరాయని మండిపడ్డారు. సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నదన్నారు. గురుకులాల్లో పర్యవేక్షణ లోపించిందని, ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం అందించినప్పుడే ప్రజలు అభివృద్ధి సాధిస్తారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పై రెండు రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో ప్రజలతోపాటు ఉద్యోగులూ ఆందోళనలు చేపడుతున్నారన్నారు. ఈ శిబిరంలో 652 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందించినట్లు వైద్యులు అఖిల్, అనిల్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజినీసాయిచంద్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, మాజీ ఎంపీపీ నిర్మల, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల, గ్రామాధ్యక్షులు పరమేశ్, రామకృష్ణ, రైతు సమన్వయ సమితి నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లాయక్‌అలీ, నాయకులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
మండలంలోని మైసిగండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విస్లావత్ హర్యానాయక్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ గురువారం మధ్యాహ్నం మైసిగండి గ్రామానికి చేరుకొని, హర్యానాయక్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించినవారిలో ఎంపీ మల్లు రవి, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, వెంకటేశ్ తదితరులున్నారు