కందుకూరు, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కందుకూరుకు చెందిన కొమ్మగాల్ల జ్యోతి అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. దవాఖాన ఖర్చులు లేకపోవడంతో ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డిని ఆశ్రయించడంతో విషయాన్ని సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు చికిత్స కోసం ఆమె రూ. 1.20లక్షల మంజూరు చేసి ఎల్వోసీని బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మండల బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, మండల సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్‌రెడ్డి,బాలయ్య, బాధితులు పాల్గొన్నారు.
వనస్థలిపురం : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీకి చెందిన రమణి మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నది. ఆమెకు రూ. లక్ష ఎల్వోసీ మంజూరయ్యింది. ఆ చెక్కును ఆదివారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. సరైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మధుసాగర్, రాకేశ్ ఠాకూర్ పాల్గొన్నారు.