పరిశ్రమల ఏర్పాటుకు సకల సౌకర్యాలను కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రవాణా కోసం రాచబాటలు వేస్తున్నది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు పలు ప్రాంతాలను కలిపేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. ఇందుకు రూ.60 కోట్లను కేటాయించగా, బొంగుళూరు ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఎలిమినేడు వరకు రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. త్వరలో ఎలిమినేడులో రెండు ప్రముఖ పరిశ్రమలు ఏర్పాటు కానుండగా, 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. కొంగరకలాన్ గ్రామంలో రెండువందల ఎకరాల్లో ఫాక్స్‌కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ ఏర్పాటు కానున్నది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుండడంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం, మార్చి 9
ఇబ్రహీంపట్నం, మార్చి 9 : రంగారెడ్డిజిల్లాలో పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతున్నది. నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రముఖ కంపెనీలు ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ముఖ్యమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు కానున్న పలు ప్రాంతాలను కలుపుతూ.. రూ.60కోట్లతో అతిపెద్ద రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు మీదుగా బొంగుళూరు ఓఆర్ఆర్ వరకు సుమారు 100 మీటర్ల వెడల్పు రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల పొడవుగల ఈ రోడ్డు పూర్తయితే త్వరలో ఎలిమినేడులో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు మార్గం మరింత సుగమమవుతుంది.
త్వరలోనే ఎలిమినేడులో రెండు ప్రముఖ పరిశ్రమలు
ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో త్వరలోనే రెండు ప్రముఖ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఎలిమినేడులో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. భూసేకరణ పనులు కూడా పూర్తికావడంతో త్వరలోనే పరిశ్రమల ఏర్పాటుకు ముహూర్తం పెట్టనున్నారు. ఆదిబట్ల సమీపంలోగల టాటా ఏరోస్పేస్‌కు అనుబంధంగా మరో ఏరోస్పేస్ సంస్థను ఎలిమినేడులో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే టాటా గ్రూప్స్ అధికారులు నిర్ణయించారు. హ్యూండయ్ కంపెనీకి సంబంధించి కార్ల తయారీ యూనిట్లను కూడా ఎలిమినేడులో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఈ రెండు సంస్థలకు ఒక్కోదానికి 300 ఎకరాల చొప్పున భూమిని కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడం కోసం ప్రత్యేక రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయితే ఎలిమినేడులో రెండు పరిశ్రమల పనులు ప్రారంభం కానున్నాయి.
పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు
ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్న ఆదిబట్ల, కొంగరకలాన్, ఎలిమినేడు వంటి గ్రామాలకు ఔటర్‌రింగ్‌రోడ్డును అనుసంధానం చేస్తూ అనేక రోడ్లు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగానే బొంగుళూరు ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ఎలిమినేడు వరకు ఎలిమినేడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు వేస్తున్న రోడ్డు దాదాపు పూర్తి కావచ్చింది. ఈ రోడ్డు పూర్తయితే ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ఎలిమినేడు వరకు 30 నిమిషాల్లో ప్రయాణం చేసే అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఎలిమినేడు, మంగల్‌పల్లి, పోచారం తదితర ప్రాంతాల్లో ఇరుకుగా ఉన్న వంతెలను కూడా వెడల్పు చేయడంతోపాటు అతిపెద్ద వంతెల నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటికే పరిశ్రమలకు అవసరమైన నీటిని మిషన్ భగీరథ ద్వారా అధికారులు అందిస్తున్నారు. ఆదిబట్ల సమీంపలోని టీసీఎస్, టాటా అడ్వాన్స్డ్ మార్టిన్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సెక్టార్లకు మిషన్ భగీరథ ద్వారా ప్రత్యేక పైపులైన్లను ఏర్పాటు చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్‌ను కూడా అధికారులు సత్వరమే అందిస్తున్నారు. ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్నది.
కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ ఆధ్వర్యంలో మరో పరిశ్రమ
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్ గ్రామంలో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇందుకోసం ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే కొంగరకలాన్‌ను సందర్శించి ప్రభుత్వం కేటాయించిన భూమిని చూసి ఇక్కడే పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖద్వారా తెలియజేశారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో త్వరలోనే మూడు అత్యంత ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు ఏర్పాటు కానుండటంతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కూడా పెద్దఎత్తున లభించనున్నాయి. కొంగరకలాన్‌లో నిర్మించనున్న ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఏటా పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకురానున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తాం : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రవాణా సౌకర్యం, తాగునీరు, విద్యుత్‌తో పాటు ప్రభుత్వపరంగా అన్ని అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడులో త్వరలో ఏర్పాటు కానున్న ఏరోస్పేస్, హ్యూండయ్ కంపెనీలకు అవసరమైన అతిపెద్ద రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
త్వరలోనే రోడ్డు పనులు పూర్తి కానున్నాయి. రోడ్డు పనులు పూర్తి కాగానే ఎలిమినేడులో రెండు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు కానున్న మరో ప్రఖ్యాత సంస్థకు కూడా అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వం నుంచి కల్పిస్తాం. ఇప్పటికే నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పారిశ్రామిక ప్రాంతాల్లో ల్యాండ్అండ్ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఆదిబట్లలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే మేడిపల్లి సమీపంలో నెలకొల్పనున్న ఫార్మాసిటీ కోసం మేడిపల్లిలో కూడా ప్రత్యేక పోలీస్‌స్టేషన్ కూడా ఏర్పాటు కానుంది.
ఇబ్రహీంపట్నం ప్రాంతం అభివృద్ధికి ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది : వెంకటప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ, ఇబ్రహీంపట్నం గతంలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ, ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని దీవెనలతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఎలిమినేడులో పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతంలో రోడ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రోడ్ల మరమ్మతుతో భూముల ధరలు కోట్లలో పలుకడంతోపాటు ఈ ప్రాంతంలోని రైతులు కోటీశ్వరులుగా మారిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇంతలా కృషిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రుణం తీర్చుకోలేనిది.