రంగారెడ్డి, మే 17 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారికి ఆనుకుని ఉన్న ఐదెకరాల పైచిలుకు భూమిని ఓ నిర్మాణ సంస్థ కొల్లగొట్టింది. ఈ స్థలాన్ని జీవో 58, 59 కింద కేటాయించిన విధానం సరిగా లేదని పలు ఆరోపణలు వచ్చినా అధికారులు క్రమబద్ధీకరించడం అనుమానాలకు తావిస్తున్నది.
ఆ సంస్థ ఈ భూమిలో పెద్దపెద్ద అపార్ట్మెంట్లతోపాటు షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టి.. విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు కేటాయించారని కొందరు స్థానికు లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా…ఈ విషయంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తహసీల్దార్ ఈ భూమిని 58, 59 జీవో కింద చట్టవిరుద్ధంగా ఆ సం స్థకు కేటాయించారని.. రెగ్యులరైజ్ చేసిన సమయంలో ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాల్లేవని, ఈ కేటాయింపును రద్దుచేయాలని ఆయన ఆర్డీవోకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఈ భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. దానిని వెంటనే రద్దు చేయాలని కలెక్టర్‌కు నివేదికను పంపించగా.. ఈ భూవ్యవహారం జిల్లాలో చర్చ నీయాంశంగా మారింది.
నిబంధనలకు పాతర
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని సర్వేనంబర్ 212లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంతభాగాన్ని ప్రభుత్వం ఇండ్లులేని నిరుపేదలకు గతంలో కేటాయించింది. మిగిలిన ఐదెకరాలపై చిలుకు భూమిని నగరంలో పేరొందిన ఓ నిర్మాణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా 58, 59 జీవో కింద కేటాయించారు. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.50 కోట్లకు పైగా ఉంటుంది. ఈ భూమిలో ప్రస్తుతం నాలుగు బ్లాక్‌ల్లో నాలుగువందలకు పైగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను నిర్మించి విక్రయిస్తున్నారు.
అలాగే, మరి కొంత స్థలంలో షాపింగ్‌మాళ్లు నిర్మిస్తున్నారు. 58, 59 జీవో కింద ప్రభుత్వ భూమిలో గతంలో నిర్మించుకున్న చిన్నపాటి ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు మాత్రమే ఈ జీవోను వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ సం స్థకు కేటాయించిన భూమిలో వారికి సంబంధించిన ఎలాంటి ఇండ్లు లేవు. కేవలం ప్రభుత్వ భూమే ఉండగా.. దానినే 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేశారు. ఎలాంటి నిర్మాణాలు లేకుండానే కొంతమంది అధికారుల అండదండలు, లంచాలిచ్చి కారుచౌకగా కొట్టేసి క్రమబద్ధీకరించుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఈ భూ మి ప్రస్తుత రికార్డుల్లోనూ సర్కారీ గైరాన్గా ఉన్నది. ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని వెంటనే రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడంతో.. ఇందులో నిర్మించిన భవనాలను చూపించి వారు కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.

ఆ భూమికి హెచ్ఎండీఏ అనుమతులు..
ఓ నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 58, 59 జీవో కింద దక్కించుకున్న స్థలానికి హెచ్ఎండీఏ, రేరా నుంచి కూడా అనుమతులు పొంది.. అందులో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టింది. 2016లో జీవో 58, 59 కింద క్రమబద్ధీకరించుకున్న ఆ సంస్థ 2025లో హెచ్ఎండీఏ నుంచి నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నది. రెగ్యులరైజ్ చేసుకున్న పదేండ్ల తర్వాత అపార్ట్మెంట్ల నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకోవటమే కాకుం డా తుర్కయాంజాల్‌లోని సాగర్ రహదారి పక్కన పెద్దపెద్ద అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించాలి కానీ.. పెద్దలకు కేటాయించటంపై రుసరుసలాడుతున్నారు. జిల్లాలో ఎంతోమంది పేదలు ఇండ్ల స్థలాల కోసం కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్నా వారికి కేటాయించకుండా కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఓ నిర్మాణ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఎవరి అస్తం ఉందని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పందించి నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
