హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : పేదల ఇండ్లు కూల్చి, వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా నిలిచిన ఏవీ రంగనాథ్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. మూర్ఖత్వం మారలేదు.. మొండివాదనా వీడలేదు. గట్టిగా లాగి చెంపదెబ్బ కొట్టినట్టుగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతూ వక్రభాష్యం చెప్పడం ఆయనకే చెల్లింది. తప్పెవరిదో హైకోర్టు నిర్ధారిస్తే, కబ్జాదారులు హైకోర్టును తప్పుదోవ పట్టించారంటూ వితండవాదం మొదలుపెట్టారు. కిందపడ్డా తనదే పైచేయి అనేలా ఉన్నది ఆయన తీరు. రెండేండ్లుగా హైడ్రా పేరిట నగరంలో జరిగిన విధ్వంసం, అక్రమాలపై ఓవైపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. తాను చేసిన దాంట్లో తప్పేలేదని సమర్థించుకునే పనిలో పడ్డారు.
ఇన్నాళ్లూ చెరువుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేశారు. ఎన్నో ఇండ్లు కూల్చి, మరెన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. పెద్దలకు ఒక చట్టం.. పేదలకు మరో చట్టం అమలు చేశారు. ఒక విధంగా హైడ్రా పేరుతో నిరుపేదల నీడలపై విధ్వంసకాండకు పాల్పడ్డారు. చెరువులు, కుంటలను కాపాడుతున్నామనే సాకుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లతో దండయాత్ర చేశారు. రాత్రికిరాత్రే ఇండ్లపైకి దండెత్తి తమ కండ్ల ముందే పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. కనీసం ఇండ్లలో సామగ్రిని కూడా తీసుకోనివ్వకుండా నేలమట్టం చేశారు. తినే బియ్యంలో మన్నుపోశారు. కొన్ని ఘటనల్లో పిల్లలు ఆకలి అని అలమటిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా కట్టుబట్టలతో నడిరోడ్డున పడేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, హెచ్చరికలు లేకుండా ఇండ్లను చెల్లాచెదురు చేశారు. సెలవు దినాలు చూసుకొని పేదల ఇండ్లపై తెగబడ్డారు. నగరంలో శనివారం వచ్చిందంటేనే పేదలు హడలెత్తిపోయేలా చేశారు. మానవత్వం, చట్టాలను మరచి హైడ్రా ముసుగులో ఆయన సాగించిన దమనకాండపై అనేకమంది కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేస్తే తాను చేసిందాంట్లో తప్పేమీ లేదని ఎదురుదాడికి దిగారు. దీన్నిబట్టి న్యాయస్థానాలపై ఆయన వైఖరేందో మరోసారి తేలిపోయింది.
ఈ క్రమంలో తాను చేసిన పనులను సమర్థించుకుంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం చెరువులు, పార్కులను రక్షించానని రంగనాథ్ సమర్థించుకున్నారు. రెండేండ్లలోనే రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమణల నుంచి వెనక్కి తీసుకున్నట్టుగా తెలిపారు. ఆయన కాపాడిన దాంట్లో, నేలమట్టం చేసిన వాటిల్లో ఏ ఒక్క పేద, మధ్యతరగతి వర్గానికి నష్టం కలుగలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి పేదలకు నష్టమే కలుగకుంటే నగరంలో రోడ్డున పడ్డ లక్షలాది మంది ఎవరు? ఓవైపు కండ్ల ముందటే కలల సౌధాన్ని నేలకూల్చుతుంటే గుండెలు బాదుకుంటూ కన్నీళ్లుపెట్టింది ఎవరు? ఆవేదనతో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం, హైడ్రాపై దుమ్మెత్తి పోసింది ఎవరు? సర్కార్ తమ ఇండ్లు కూలుస్తున్నదని ప్రతిపక్ష పార్టీల ఆశ్రయం కోరిందెవరు? వాళ్లందరూ పేదలు కారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇక తనపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులను కప్పిపుచ్చుకుంటూ ల్యాండ్ మాఫియా చేతిలో తాను బలిపీఠమెక్కినట్టుగా రంగనాథ్ మొసలి కన్నీళ్లు కర్చారు.
నిజంగానే ల్యాండ్ మాఫియాను ఆయన కట్టడి చేసిఉంటే సర్వత్రా హర్షాతికేరాలు వ్యక్తమయ్యేవే! కానీ ఆయన పేదల ఇండ్లను మాత్రమే కూల్చి పెద్దల ఇండ్ల జోలికి ఏమాత్రం వెళ్లలేదు. పెద్దలు అయితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అదే పేదల ఇండ్లయితే ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా కూల్చివేశారు. ఇదే పాపం రంగనాథ్‌కు తగిలిందని స్వయంగా బాధితులే శాపనార్థాలు పెడుతున్నారు. తనపై ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు వేసినవేనని రంగనాథ్ కొట్టిపారేయడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతా శ్రీరాం, సంధ్యా శ్రీధర్ రావు, నల్లా మల్లారెడ్డి వంటి వారి ఆక్రమాలను అడ్డుకోవడమే తాను చేసిన తప్పని వ్యాఖ్యానించారు. కోర్టు వ్యాఖ్యలను అంగీకరిస్తున్నానంటూనే మరోవైపు విమర్శలు చేయడం, హైకోర్టు తీర్పు తీవ్రతను తక్కువ చేసి చూపించేలా మాట్లాడారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉన్నదంటూనే, కోర్టులను ఆశ్రయించిన వారిని ముద్దాయిలుగా చిత్రీకరిస్తున్నారని పెడార్థాలు తీశారు. ఆయన తీరు హైకోర్టు తీర్పు తీవ్రతను తక్కువ చేసి చూపేలా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.