నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 11: రైతులకు సాగునీరందించేందుకు కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేఎల్ఐ పథకం మూడో లిఫ్ట్‌లో భాగమైన గుడిపల్లి రిజర్వాయర్ మోటర్లు శుక్రవారం ఆఫ్ చేశారు. బీఆర్ఎస్ నేతల అల్టిమేటంతో శుక్రవారం ఉదయం 7 గంటలకే మోటర్లను ఆన్ చేసిన అధికారులు.. కరెంటు సరఫరా లేదంటూ సాయంత్రానికి బంద్ చేశారు. దీంతో వేల ఎకరాల్లోని ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. గుడిపల్లి రిజర్వాయర్‌లో నెల రోజులుగా సక్రమంగా మోటర్లు నడపడం లేదు. అడిగితే కరెంటు లేదని, మెయింటనెన్స్ ఉందంటూ తప్పించుకుంటున్నారని రైతు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కరెంటు లేదంటూ మోటర్లు ఆన్ చేయకుండా ఉండి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శనకు వస్తున్నారని తెలుసుకొని ఒక మోటర్ ఆన్‌లో ఉండగా.. మరో రెండు మోటర్లు ప్రారంభించారు. ఆ తర్వాత సాయంత్రానికి బంద్ చేశారు.
పంటపొలాలకు నీరందించేందుకు మోటర్లకు కరెంటు సరఫరా చేయలేకపోతే చేతకాదని చెంపలేసుకొని సీఎం రేవంత్‌రెడ్డి గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాయంత్రానికి మోటర్లను ఆఫ్ చేశారన్న విషయం తెలుసుకున్న మర్రి ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడిపల్లి లిఫ్ట్ మోటర్లను నడిపే పరిస్థితి చూస్తుంటే రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదని, బీఆర్ఎస్ నాయకులకు చూపించడానికి మోటర్లు ఆన్ చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తాము వెళ్లి సందర్శించినప్పుడు మోటర్లు ఆన్‌లో పెట్టి సాయంత్రానికి బంద్ పెట్టడం ఏందని ప్రశ్నించారు.