బోడుప్పల్, సెప్టెంబర్ 11 : బోడుప్పల్, చెంగిచర్లలోని వేలాది ఎకరాల పట్టా భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ ఆధ్వర్యంలో పలువురు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 1965 నుంచి భూములుగా క్రయవిక్రయాలు జరిగినా.. నేడు వాటిని 22ఏ జాబితాలో చేర్చడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలను మానసికంగా, ఆర్ధికంగా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వారు శాపనార్ధాలు పెట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హరీశ్‌రావును కలిసి వారిలో హరికాంత్ గుప్త, సోమన్న, ఉప్పరి విజయ్ ఉన్నారు.
ప్రజల జీవితాలతో చెలగాటం
కాంగ్రెస్ సర్కార్ కోటికిపైగా ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఒక్క గీతతో లక్షలాది మంది ఆస్తులను జీరో వ్యాల్యూ చేసింది. 22-ఏ ముసుగులో ప్రభుత్వం భారీ స్కాంకు తెరలేపింది. ప్రజల నుంచి 30 శాతం కమీషన్ల పేరిట దోచుకుంటున్నది..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో 22-ఏ నిషేధిత భూముల స్కాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.