హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ పరిణామాలను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై దళిత వ్యతిరేక ముద్ర వేయాలని చూస్తున్నారని, వాస్తవానికి దళితులు, దళిత క్రైస్తవులను రాజకీయంగా వాడుకొని మోసం చేసిందే రేవంత్‌రెడ్డి అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో ఉన్నవారంతా దళితులు, దళిత క్రైస్తవులేనని, వారిని పావులుగా వాడుకొన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు పట్టించుకోకపోవడంతో వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నాడు ఓటుకు నోటు కేసులో తనను పట్టించిన మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సెక్యూరిటీని కక్షగట్టి తొలగించారని, ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాశారని దుయ్యబట్టారు. రంగనాథ్‌మిశ్రా కమిషన్ నివేదికను గతంలో యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం దళిత క్రైస్తవుల హకుల కోసం బాలకృష్ణ కమిషన్‌కు మొదటి నివేదిక ఇచ్చి అండగా నిలిచింది కేసీఆర్ మాత్రమేనని రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించడంతోపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారి నిరసనల్లో బీఆర్ఎస్ భాగస్వామ్యమైందని వివరించారు. అంబేదర్ పుట్టిన మహారాష్ట్రలోనే లేని విధంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిషరించి, సచివాలయానికి ఆయన పేరు పెట్టి, మారెట్ కమిటీల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే స్పీకర్‌గా ఉన్న నేతను ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు.
దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పేరిట రూ.10 లక్షలు అందిస్తే, కాంగ్రెస్ పార్టీ రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నిలువునా మోసం చేసిందని బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినందుకు కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.