ధారూరు, మే 17 : మండలంలోని తరిగోపుల వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత ఆదివారం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా గ్రామంలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెలో మిషన్ భగీరథ నీరు రాని సమయంలో చేతిపంపులు, బోరు బావుల నుంచి నీటిని అందించేవారు. అయితే బోరుమోటర్ కాలిపోవడంతో సమస్య తీవ్రమైంది. గ్రా మంలో భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లు వేసినా నీళ్లు పడడంలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసినా సరిపోవడం లేదని.. బిందెడు నీటి కోసం ట్యాంకర్ వద్ద యుద్ధం చేయా ల్సి వస్తున్నదని పలువురు మహిళలు పేర్కొంటున్నారు. గ్రామం పెద్దది కావడంతో ట్యాంకర్ నీరు సరిపోవడంలేదని.. నిరుపయోగంగా ఉన్న చేతిపంపు లు, వాటర్ ట్యాంకులు, బోరుమోటర్లకు మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రామంలో నీటి సమస్య ఏర్పడింది నిజమే. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రత్నామ్నాయంగా ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశాం. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
-స్వప్న, పంచాయతీ కార్యదర్శి, తరిగోపుల