వికారాబాద్, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారంలో ‘మీతోనేను’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలో తిరుగుతూ, ప్రజ లను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్లైన్కు గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, నీళ్లు ప్రతి ఇంటికి అందివ్వాలన్నారు.
ప్రజలు చెర్రలు తీయ కుండా.. మోటర్లు పెట్టకుండా నీటిని వాడుకోవాలన్నారు. వారానికి ఒక సారి వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయాలని సూచించారు. అంగన్వాడీ, ఆయా, ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండి, ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ సేవలు అందించాలని తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించి బిల్లులు మంజూరు కానివారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. నూతనంగా మున్సిపల్లో కలిసిన ధన్నారంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన కల్యా ణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బూరన్పల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్కు దళిత బంధు పథకం కింద ట్రాక్టర్ను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, కమిషనర్ శరత్చంద్ర, తహ సీల్దార్ షర్మిల, కౌన్సిలర్ రాములు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.