కందుకూరు, డిసెంబర్ 27 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కందుకూరు మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన రంగారెడ్డి జిల్లా మత్స్యకారుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం వల్ల మనకు దక్కాల్సిన రిజర్వేషన్లు, ఉద్యోగాలు కోల్పోతున్నామన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయంతో రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నట్లు వివరించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొహెడలో జాతీయ స్థాయి చేపల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సురుసాని రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.