ఒకరిది సంబురం.. మరొకరిది భావోద్వేగం.. మరొకరికి ఆనంద భాష్పాలు.. సరూర్‌నగర్ విక్టోరియా హోం ఆవరణలో కనిపించిన దృశ్యాలివి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి సబితారెడ్డి దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, దయానంద్, జనార్దన్‌రెడ్డి, మూసీ రివర్‌ఫ్రంట్ చైర్మన్ సుధీర్‌రెడ్డి వాహనాలను నడిపి సందడి చేశారు. తొందర్లోనే ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా దళితబంధులాంటి పథకం లేదని, సీఎం కేసీఆర్ చొరవతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ పథకంతో ఆర్థిక అభ్యున్నతి సాధించి ఆదర్శంగా నిలువాలని ఆమె లబ్ధిదారులకు సూచించారు. తమ కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారుల సంబురాలతో విక్టోరియా హోం ఆవరణలో పండుగ వాతావరణం కనిపించింది.
రంగారెడ్డి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్లో 50 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధులాంటి పథకం వస్తుందని జీవితంలో ఊహించి ఉండరని, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించేది లేదని చెప్పారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రూ.10 లక్షలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపారాలను మాత్రమే ఎంచుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించామని, ఎక్కడైనా వ్యాపారం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. మరోవైపు వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడితే వారిని ఆదుకునేందుకు ప్రత్యేకంగా రక్షణనిధిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రూ.8 కోట్ల మేర రక్షణనిధిలో జమ చేశామని మంత్రి వెల్లడించారు. దశల వారీగా నియోజకవర్గానికి 2 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, బాలికలకు విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 53 గురుకులాలను బాలికల కోసం ఏర్పాటు చేశారన్నారు. రెండు పీజీ కాలేజీలు, రెండు లా కాలేజీల ఏర్పాటుతో బిజినెస్ స్కూళ్లలో చదువుకునే అమ్మాయిలకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తున్నదని మంత్రి అన్నారు. పేద విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునే విధంగా ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందని మంత్రి తెలిపారు.
సాహసోపేతమైన నిర్ణయం : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
దళితబంధు పథకం సాహసోపేతమైన నిర్ణయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందుతున్నదని చెప్పారు. గతంలో బ్యాంకుల నుంచి రూ.50-60వేల రుణాలిప్పించి ప్రచారం చేసుకునేవారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి జమానత్ లేకుండా రూ.10 లక్షలను అందజేస్తుందన్నారు.
దళితులకు సువర్ణావకాశం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు పథకం దళితులకు సువర్ణావకాశమని మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. లబ్ధిదారుల వ్యాపారాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
విమర్శలు సరికాదు : ఎమ్మెల్యే యాదయ్య
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు విమర్శలు మాని అవగాహనతో మాట్లాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హితవు పలికారు. దళితబంధు కింద రూ.10 లక్షలు ఇవ్వడమంటే సాధారణ విషయం కాదని, కిస్తులు చెల్లించే అవసరం లేకుండా కోరుకున్న యూనిట్లను అందజేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.
బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాలి :ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై విమర్శలు చేసే బీజేపీలాంటి మోసగాళ్లకు దళితులు తగిన బుద్ధి చెప్పాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. దళితులు అన్నింటిలోనూ వెనుకబడి ఉండడంతోపాటు ఇంకా వ్యవసాయ కూలీలుగానే బతుకుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు.
మరో 500 మందికి త్వరలో అందజేస్తాం..
– కలెక్టర్ అమయ్‌కుమార్
దళితబంధు పథకం కింద మరో 500 మందికి త్వరలో యూనిట్లను అందజేస్తామని కలెక్టర్ డి.అమయ్‌కుమార్ తెలిపారు. కార్లు, ట్రాక్టర్లే కాకుండా మార్కెట్లో డిమాండ్ ప్రకారం ఆయా వ్యాపారాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. త్వరలో అందజేసే యూనిట్లను ఆయా మండలాల్లోనే లబ్ధిదారులకు అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
దళితబంధుతో ఆర్థికంగా బలోపేతం :జడ్పీ చైర్పర్సన్ అనిత
దళితులు ఆర్థికంగా బలోపేతం చెందేందుకే దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. లబ్ధిదారులకు వ్యాపార మెళకువలు నేర్పి ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటునందిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
నేను రోజువారీ కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాను. రోజుకు రూ.200ల మేర కూలీ వచ్చేది. దళితబంధు పథకం కింద ట్రాక్టర్‌ను అందజేశారు. రూ.10 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, నాగళ్లు వచ్చాయి, దీంతో పొలాల్లో పనులు చేయడంతోపాటు ఇతర పనులతో నెలకు రూ.9-10 వేలు సంపాదిస్తా. దళితులను ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. దళితులు ఆర్థికంగా ఎదుగాలనే మంచి ఉద్దేశంతో మా జీవితాలను నిలబెట్టిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.
– పుల్కం చిల్కయ్య, కవాడిపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
దళితబంధుతో సొంత ట్రాక్టర్ వచ్చింది..
నాకు ఇద్దరు కూతుర్లు. నేను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడిని. పని ఉన్నప్పుడు మాత్రమే నడిపిస్తుంటి పైసలు ఇస్తుండ్రి. సరైన బతుకుదెరువు లేకపోవడంతో చాలా కష్టాలు పడిన. రూ.10 లక్షల విలువ చేసే ట్రాక్టర్ అందజేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ప్రభుత్వం అందించిన సాయంతో నేను మరొకరికి ఉపాధి కల్పిస్తా.
– వల్లెపాగ నర్సింహ
దళితులకు మంచి అవకాశం : ఎమ్మెల్సీలు
దళితబంధు పథకం దళితులకు మంచి అవకాశమని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, దయానంద్, జనార్దన్‌రెడ్డి సూచించారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా ఉంచాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు.