రక్షణ చర్యల్లో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చేవెళ్ల, నందిగామ మండల కేంద్రాల్లో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవనాలను బుధవారం ఆయన ఎంపీలు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అత్యధిక నిధులు వెచ్చించి తెలంగాణ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 585 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌నూ అధునాతన సౌకర్యాలతో నిర్మించడంతోపాటు ప్రతి నెలా నిధులు అందిస్తున్నారన్నారు. పోలీస్ కమిషనరేట్లను తొమ్మిదికి పెంచారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులంటే ప్రజలకు నమ్మకం, మర్యాద పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 333 షీటీంలు, భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 64శాతం తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
షాబాద్/చేవెళ్ల టౌన్/షాద్‌నగర్, ఏప్రిల్ 19 : తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో రూ.కోటి నిధులతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని డీజీపీ అంజనీకుమార్, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా నందిగామ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, డీజీపీ అంజనీకుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి ప్రారంభించారు. అనంతరం రెండుచోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో హోం మంత్రి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం మొదటి స్పీచ్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై మాట్లాడినట్లు చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారన్నారు. తెలంగాణ రాక ముందు తక్కువ పోలీస్స్టేషన్లు ఉండేవన్నారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్లకు ప్రతి నెలా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదన్నారు. అర్బన్ ప్రాంతాల్లో రూ. 75వేలు, పట్టణాల్లో రూ.50వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసులుగా బాగా పని చేస్తున్నారని, పోలీసులంటే ప్రజలు మర్యాద ఇస్తున్నారన్నారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్‌తో రూ. 585 కోట్లు ఖర్చు చేశారని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పది జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఉన్న రెండు పోలీస్ కమిషనరేట్లను ఇప్పుడు 9కి పెంచారన్నారు. పోలీసు అధికారులు బాగా పని చేస్తున్నారని, మహిళలకు పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం కోటా ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణలో 333 షీటీమ్స్, భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. 2014 ముందు రాష్ట్రంలో ఎన్నో ఘర్షణలు జరిగాయని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకూ కర్ఫ్యూ విధించలేదన్నారు.
హైదరాబాద్‌కు దీటుగా నేడు చేవెళ్ల ప్రాంతం హైటెక్ నియోజకవర్గంగా బాగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడం సంతోషకరమన్నారు. ఇండియాలో ఉన్న సీసీ కెమెరాల్లో 64 శాతం తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ అవినాశ్మహంతి, డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, అడిషినల్ డీసీపీ రస్మిపేరుమాల్, ఏసీపీ ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి, జడ్పీటీసీ మర్పల్లి మాలతీ, వైస్ ఎంపీపీ శివప్రసాద్, గ్రామ సర్పంచ్ బండారి శైలజా, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సీఐలు వెంకటేశ్వర్లు, గురువయ్యగౌడ్, లక్ష్మిరెడ్డి, ప్రసన్నకుమార్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నందిగామలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ప్రియాంక, రాష్ట్ర సహకార సొసైటీల చైర్మన్ రాజావర ప్రసాద్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, ఏసీపీ కుషల్కర్, సీఐలు రాములు, సత్యనారాయణ, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, దేవేందర్‌యాదవ్, సత్యనారాయణ, మర్రిపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Minister Mahmood Ali
చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ 2014 జూన్ 2వ తేదీ తర్వాత సికింద్రాబార్ ఫరేడ్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ మొదటి స్పీచ్‌లో లా అండ్ ఆర్డర్‌ను వివరించారన్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అక్కడికి పోలీసులు చేరుకుంటారన్నారు. నందిగామలోని పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ నాట్కో పరిశ్రమ యజమాన్యం సహకారంతో నూతన భవనం నిర్మించుకోవడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సహకరించిన నాట్కో ఫార్మ సంస్థ డైరెక్టర్ నన్నపనేనినన్నపనేని రాజీవ్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ అంటే ఒక దిశ నిర్దేశం, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్, ఫార్మా సహా అన్ని రంగాల్లో మనమే నంబర్‌వన్‌గా ఉన్నామన్నారు. భద్రత మాదే, బాధ్యత మాదే, ఉన్నాం మేము మీ కోసం అనే మాటను అక్షరాలా అమలు చేసి చూపుతున్నారని పోలీసు శాఖను అభినందించారు. హైదరాబాద్ నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరంలో 7లక్షల సీసీ కెమోరాలు ఉన్నాయని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిలబడి ఒక్క సింగిల్ టిప్‌తో సీటీలో ఉన్న ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు. దేశంలో ఉన్న కెమెరాలన్నింటిని కలుపుకుంటే 60 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని చెప్పారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ 14 ఏండ్లు పోరాటం చేసిన సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడు, రాష్ర్టానికి రథసారథి, ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటదంటే నేడు తెలంగాణనే నిదర్శమన్నారు. భారతదేశంలో 29 రాష్ర్టాలుంటే…ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని అమలుల్లో తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని, అందుకే దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారన్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందన్నారు. షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో పోలీస్‌స్టేషన్ భవనాలతో పాటు సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ నిర్మించాలని, శంకర్‌పల్లిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, సీఎంతో మాట్లాడాతానని తెలిపారని చెప్పారు.