పరిగి, ఆగస్టు 2 : పాలన చేతగాక కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం పరిగిలోని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ.. ఊర్లలో చెట్ల కింద కూర్చునే పెద్ద మనుషులను కలిసి మీకు రూ.4వేల పెన్షన్ ఇస్తున్నాం బాగుందా అని అడిగితే, ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలను నీళ్ల పరిస్థితి అడిగితే చెబుతారని.. రైతుల వద్దకు వెళ్లి కరెంటు స్థితి, రుణమాఫీ విషయం అడిగితే చెబుతారన్నారు.
యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడుతున్నారని, వారి దగ్గరకు వెళ్లి పాలన బాగుందా అని అడిగితే ఎన్ని చెప్పుల దండలు పడతాయో, ఎన్ని చీపురుదెబ్బలు పడతాయో తెలుస్తుందన్నారు. హైవే బ్లాక్ చేసి ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఏ ఊర్లోకి వెళ్లింది లేదు, ముసలోళ్లు, మహిళలు, రైతులను కలిసింది లేదని, బరాత్ తీసినట్లు హంగామా చేసుకుంటూ వచ్చారని, ఇది ప్రజలకు మేలు చేసేది కాదు కీడు చేసే యాత్ర అని పేర్కొన్నారు.
ఇది జన హిత కాదు, జన హత పాదయాత్ర అని ఆయన విమర్శించారు. జాతీయ పార్టీలో పాదయాత్ర చేయాలంటే సులభంగా అనుమతులు రావని, 2004 కంటే ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేస్తానని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆరు నెలలకు అనుమతి వచ్చిందని, వైఎస్ చనిపోతే ఆయన కొడుకు జగన్ ఓదార్పు యాత్ర చేస్తానని కుటుంబంతో వెళ్లి ఢిల్లీలో మోకరిల్లినా అనుమతి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. 50 పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎన్నిసార్లు కలిశారో.. అందుకు పదింతలు బీజేపీ వారిని కలిశారని తెలిపారు.
5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ సాధనకు ఆందోళన చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం చూస్తేనే ఇన్చార్జికి, సీఎంకు సమన్వయం లేదని స్పష్టమవుతున్నదన్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత శపథం చేసి మూడు నెలలు ఢిల్లీలో ఉండి 9వ షెడ్యూల్లో రిజర్వేషన్లు చేర్పించిన తర్వాతే తమిళనాడుకు వెళ్లారని గుర్తు చేశారు. 2004, 2009లో రాహుల్‌ను ప్రధానిగా చేయాలంటే ఎవరైనా అడ్డుపడేవారా, తమకు పూర్తి మెజారిటీ ఉందని, ఓ మేధావి మన్మోహన్సింగ్ను ప్రధానిని చేశామని పీసీసీ అధ్యక్షుడు చెప్పారంటే రాహుల్‌గాంధీ మేధావి కాదని, దేశాన్ని నడపలేరని ఒప్పుకొన్నారన్నారు.
తాము ఇప్పటికీ 65వేల ఉద్యోగాలు ఇచ్చామని పీసీసీ అధ్యక్షుడు చెప్పారని, బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు, ఫిజికల్ టెస్టులన్నీ నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పత్రాలు ఇచ్చిందన్నారు. సంవత్సరంలో ఇంకా 35వేలు ఇస్తారు కదా అని శ్రీధర్‌బాబును అడుగగా ఇవ్వం, ఇస్తామంటూ రెండు విధాలుగా మంత్రి తలూపారని ఆనంద్ చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు చేసిన పాదయాత్ర ఎన్నికల స్టంట్ అని, పాదయాత్ర ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారనేది ఎవరికీ తెలియడం లేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇవ్వడంతోపాటు గ్యారంటీ కార్డులు ఇచ్చిందని, కేసీఆర్ రైతుబంధు రూ.10వేలు ఇస్తున్నారు, తాము రూ.15వేలు ఇస్తామని, పింఛన్ రూ.2వేలు ఇస్తున్నారు.. తాము రూ.4వేలు ఇస్తామని, ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇస్తామని, ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని, కళ్యాణలక్ష్మీ కింద లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికారన్నారు.
రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, రూ.49,500 కోట్లు రుణాలున్నాయని, తాము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామంటూ పార్లమెంట్ ఎన్నికలప్పుడు దేవుళ్లపై సీఎం ఒట్లు పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు రూ.7వేల కోట్లతో కాలువల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెండర్లు రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 8 మంది ఎంపీలు రాష్ట్రం నుంచి గెలిచారని, పార్లమెంటును స్తంభింపజేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులున్నారు.