ఆదిబట్ల, డిసెంబర్ 9 : కనీస సౌకర్యాలు కల్పించే వరకు ధర్నాను విరమించేది లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో అద్దె భవనంలో ఉన్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల విధ్యార్థులు మంగళవారం రెండో రోజు కళాశాల ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా మెడికల్ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. అద్దె భవనంలో కళాశాలను ఏర్పాటు చేసి రెండేండ్లు గడుస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విపలమైయ్యారని అన్నారు. పేరుకే ప్రభుత్వ మెడికల్ కళాశాల.. అందులో ఉన్న ల్యాబ్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎంతో మంది విద్యార్థులు హాస్టల్లో సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రైవేట్ హాస్టల్లో వేల రూపాయలు ఫీజులు చెల్లించి ఉంటున్నారని అన్నారు.
ఇప్పటికీ 100 మంది విద్యార్థులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆరోపించారు. కనీసం బస్సు సౌకర్యం లేక కళాశాల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేక పోవడంతో పక్క కళాశాలలోని బీటెక్ విద్యార్థులు అర్ధరాత్రి బర్త్ డే పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ధర్నా కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పూర్తిగా మద్దతు ప్రకటించింది.
కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కళాశాల విద్యార్థులు రెండో రోజు ధర్నా చేపట్టడంతో వెంటనే రాష్ట్ర వైద్య, విద్య డైరెక్టరేట్ డాక్టర్ కె శివరాం ప్రసాద్ కళాశాలను సందర్శించారు. ధర్నా చేపట్టిన విద్యార్థులకు రెండు రోజుల్లో హాస్టల్ నూతన భవనం తో పాటు విద్యార్థులకు రెండు బస్సులను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. వెంటనే ధర్నాను విరమించాలని విద్యార్థులను కోరారు. ఈ సందర్బంగా విద్యార్థులు గతంలో కూడా తమ సమస్యల పై వినతిపత్రం అందచేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, మీరు ఇచ్చే హామీపై మాకు నమ్మకం లేదని తేల్చి చెప్పారు. మా సమస్యలు పరిష్కరించే వరకు ధర్నాను కొనసాగిస్తామని మెడికల్ కళాశాల విద్యార్థులు అన్నారు.