KP Vivekananda | దుండిగల్, మార్చి 2: పదవులతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వారే నిజమైన నాయకులని బీఆర్ఎస్ పార్టీ విప్ , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిజాంపేటలో ఆదివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాజా మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. రాజకీయాలలో పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నాయకుడు అనే వాడు ఎప్పుడూ పాటు పడాలని సూచించారు. అనంతరం తాజా మాజీ ప్రజా ప్రతినిధులకు శాలువాలు కప్పి ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ తాజా మాజీ కార్పొరేటర్లు, తాజా మాజీ కో- ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.