దుండిగల్, మే 3: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ కేటీఆర్ కాలనీలోని పార్కులో మౌళిక వసతుల కల్పనపై శనివారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరచామని తెలిపారు. రానున్న రోజుల్లో నిజాంపేట కార్పొరేషన్లోని అన్ని బస్తీలలో వంద శాతం అభివృద్ధి పనులు పూర్తిచేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కుత్బుల్లాపూర్ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని కాలనీల మధ్య ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తూ సమీప కాలనీవాసులు వ్యాయామం చేసుకునే విధంగా, పిల్లలకు ఆటవిడుపుగా అందరికీ ఉపయోగపడేలా ఈ పార్కును అభివృద్ధి పరుస్తామని చెప్పారు.
అనంతరం బాలాజీ హిల్స్, కేటీఆర్ కాలనీ, వినాయక నగర్, గాయత్రి గార్డెన్స్, తిరుమల నగర్, బాలాజీ మెడోస్, అఖిల అబౌట్ కాలనీ వాసులు, రాజీవ్ గాంధీ నగర్ బెరాకా పాస్టర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులు, సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు.
కేపీ వివేకానందను కలిసిన మధురా నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మధురా నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానందను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య సంక్షేమ సంఘాలు వారధిగా ఉండాలని, కాలనీ అభివృద్ధి దిశగా నూతన సంక్షేమ సంఘం పనిచేయాలని సూచించారు.