కాప్రా ఏప్రిల్ 8: బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సైనిక్‌పురిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను వరంగల్ సభ వేదికగా ఎండగట్టాలని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గవ్యాప్తంగా గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున వరంగల్ సభకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని బండారి లక్ష్మారెడ్డి విమర్శించారు. హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలను నాశనం చేసిండని.. భూముల అమ్మకాల పేరుతో మూగజీవాల ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు. ఆ మూగజీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవని అన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి సగం రుణం మాఫీ చేసి చేతులు ఎత్తేసిండని పేర్కొన్నారు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టిన సొమ్ములు రూ.13వేల కోట్లు, రుణమాఫీ చేసింది రూ.14వేల కోట్లు అని చెప్పారు. అంటే రైతుబంధును ఎగ్గొట్టి సగం రుణమాఫీ చేసిండని దుయ్యబట్టారు.