అంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులు మందలించడమే పాపమైంది. తల్లిదండ్రలు తిట్టారనే మనస్తాపానికి గురై ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీ, తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో నివాసం ఉంటున్న రాకేశ్ కుమార్ దంపతులిద్దరూ ప్రైవేటు కంపెనీల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి చేయగా.. చిన్న కూతురు తేజస్విని (19) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుంది. ఈ మధ్యకాలంలో తేజస్విని ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం తల్లిదండ్రులు గమనించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా అలాగే ఫోన్లో మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. ఫోన్లు మాట్లాడటం తగ్గించాలని సూచించారు. తల్లిదండ్రులు కోప్పడ్డారనే తేజస్విని మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తల్లిదండ్రులు ఎవరి పనులకు వారు వెళ్లగా.. సోదరుడు కూడా బయటకు వెళ్లాడు.
అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు వచ్చిన టెక్నీషియన్ రాకేశ్‌కు ఫోన్ చేయగా.. తాను ఇంట్లో లేనని, తన కూతురు తేజస్వినికి ఫోన్ చేయాలని నంబర్ ఇచ్చాడు. టెక్నీషియన్ ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ రాకేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో రాకేశ్ పక్కింట్లో ఉండే లక్ష్మీకి ఫోన్ చేసి, ఇంట్లోకి వెళ్లి చూడమని చెప్పగా తేజస్విని అప్పటికే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. కంగారుపడిపోయిన లక్ష్మీ వెంటనే విషయాన్ని తేజస్విని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం స్థానికుల సాయంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు తేజస్విని అప్పటికే మరణించిందని తెలిపారు. మృతురాలి తండ్రి రాకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కూడా 16 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. మదనపల్లెకు చెందిన గపూర్-హసీనా దంపతుల కుమార్తె మస్తానీ (16) ఎనిమిదో తరగతి చదువుకుని ఇంట్లో ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్లి తిరిగొచ్చేసరికి, మస్తానీ ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి.. బాత్రూమ్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది.