కుత్బుల్లాపూర్, మార్చి25: ఒకవైపు మద్యం మత్తు.. మరోవైపు అతివేగం.. ఫలితంగా అదుపుతప్పిన ఓ ద్విచక్రవాహనం చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కంతి ప్రాంతానికి చెందిన నాందేవ్ (44) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల నాందేవ్ ఫ్యామిలీని చూసేందుకు అతని మేనల్లుడు బాలాజీ(42) హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బైక్‌పై దగ్గరలోని వైన్స్‌కు వెళ్లి మద్యం సేవించారు. అనంతరం ఇంటికి తిరిగొస్తున్న సమయంలో ఫాక్స్ సాగర్ చెరువు కట్టపై బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్ చెరువులో పడిపోయింది. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరూ అది గమనించలేదు.
సోమవారం ఉదయం చెరువులో రెండు మృతదేహాలు తేలుతూ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.