Car crash | దుండిగల్, ఏప్రిల్ 20: ఇవాళ తెల్లవారుజామున ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చిన కారు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీ కొట్టి అవతలి వైపు (ఫల్టీ కొట్టింది) పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి అక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం జైపూర్‌కు చెందిన గిర్ధుడు భాను ప్రకాష్(36), అదే రాష్ట్రం రూర్కెలాకు చెందిన నళిని(37) స్నేహితులు. నగరంలోని ఐటీ కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం, మంచిరేవులలోని యునైటెడ్ అమిగో అవెన్యూ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్ వైపు నుంచి పటాన్చెరువు వైపు ఐ10 కారు( ఓడి10టి1947) లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో కారు వేగంగా ప్రయాణిస్తుండడంతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని, మల్లంపేట ఓఆర్ఆర్ ఎక్సిట్ 4ఏ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్‌ను ఢీ కొట్టి రోడ్డుకు అవతల వైపు పడింది.ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ప్రయాణిస్తున్న భాను ప్రకాష్, నళినిల తలలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికి అక్కడే దుర్మరణం చెందారు.
మితిమీరిన వేగం, అజాగ్రత్త వాహనం నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భాను ప్రకాష్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మేడ్చెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?