జీడిమెట్ల , మే 20 : కార్మిక కోడ్లలో యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్, ఏఐటీయూసీ మండల ఉపాధ్యక్షులు ఈ.ఉమా మహేశ్ మాట్లాడుతూ.. యాజమాన్యాలకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని తెలిపారు. ఈ కోడ్లను 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించారని.. దీనికి నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయని పేర్కొన్నారు. ఈ కోడ్లు కార్మికులకు పూర్తి వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ కోడ్లను రద్దుచేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని కేంద్రంపై ఒత్తిడి తేవడానికి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. పని గంటలను పెంచడం, ఈఎస్ఐ పీఎఫ్ చట్టాలు కార్మికుల అనుమతితో అమలు చేస్తామని పేర్కొనడం, కార్మికులకు పూర్తిగా అన్యాయం చేయడమే అని విమర్శించారు.