Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22: పాలక మండలి పూర్తయింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ప్రజలు తమ సమస్యలను ఇక నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామనే భావనలో ఉన్నారు. కానీ ఆరంభంలోనే అధికారుల కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు.
కొంపల్లి మున్సిపాలిటీకి ఇన్చార్జి ప్రత్యేక అధికారిగా ఏ. చంద్ర మోహన్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా (ఏడిఏంఏ) జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, దుండిగల్ మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా డీడీఎంఎ, సీడీఎంఏ హైదారాబాద్ అధికారి వి.సాయినాథ్లను గత నెల 25 న ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బాధ్యతలు చేపట్టి నెల రోజులు దగ్గరికి వస్తున్న ఈ అధికారులు ఇప్పటికీ ప్రజలకు దర్శనమివ్వడం లేదు. కేవలం మొదటి రోజున, ఆ తర్వాత రోజున హడావుడి చేసి వెళ్లారే తప్పా.. ఆ తర్వాత ఇటువైపు దర్శనం ఇచ్చిన పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. కాలనీలో పేరుకుపోయిన అంతర్గత సమస్యలపై నేరుగా ప్రత్యేక అధికారికి విన్నవించుకునేందుకు నిత్యం కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు తప్ప ఆ ప్రత్యేక అధికారి మోక్షం మాత్రం దక్కడం లేదని అంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో కనీసం కార్యాలయం ముందు ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నేతల ఫ్లెక్సీలను కూడా తొలగించలేని దుస్థితి కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రదర్శనలు
ప్రత్యేక అధికారుల పరిపాలన ప్రారంభమై రోజులు కావస్తున్న అధికారులు ప్రజలకు చేరువ కావడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రజలకు ఆరంభంలోనే నిరాశ గురిచేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలోని అంతర్గత డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కరెంటు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కారణం ఇక్కడ పనిచేసే ప్రత్యేక అధికారి దర్శనం లేకపోవడమే దీనికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.
సందర్శన లేకుండానే ఫైలు ముందుకు..?
మున్సిపాలిటీ పరిధిలో ప్రతి అంశాన్ని పరిశీలించి, సందర్శించిన తర్వాతనే ఏదైనా ఫైల్ ముందుకు సాగాలి. కానీ ఇక్కడ మాత్రం అలా కాకుండా ప్రత్యేక అధికారి పనిచేసే సచివాలయానికే ఓ స్థాయి అధికారి ఫైళ్లను తీసుకెళ్లి అక్కడే సంతకాలు చేయిస్తున్నారని సమాచారం. కాంట్రాక్టు బిల్లులు, కార్యాలయానికి సంబంధించిన ఇతర ఖర్చులు వంటి అనేక అంశాలకు కూడిన ఫైల్ అని ఆ అధికారి ఉన్నచోటకే తీసుకెళ్లి అంతా సజావు అంటూ క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే పైళ్లపై సంతకాలు జరగడం పట్ల అనేక ప్రశ్నలకు తావునిస్తుంది.
మున్సిపాలిటీ సైట్లోనూ మారని అధికారుల జాబితా
ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణగా టెక్నాలజీ ఆధారంగా సమాచారం సేకరించడంతో పాటు ఆన్లైన్ ఫిర్యాదు చేసేందుకు కొంపల్లి మున్సిపాలిటీ సైట్ అందుబాటులో ఉంది. అయితే సైట్ హోంపేజీలో కేవలం ముఖ్యమంత్రి ముఖచిత్రం మారిందే తప్ప కార్యాలయంలో ఆయా విభాగాల పని చేస్తున్న అధికారులు, ఇతర సమాచారాలు, ఫోన్ నెంబర్ లు వంటి సమాచారం కూడా ఇప్పటివరకు మార్పులు, చేర్పులు చేయకపోవడం గమనార్హం.
అంతా అధికార పార్టీ నేతలదే హవా..!
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు అధికారులపై హవా కొనసాగిస్తున్నట్లు బహిర్గతంగానే చర్చ నడుస్తుంది. కుప్పలు, తిప్పలుగా అనాధికారికంగా, అక్రమ నిర్మాణాలకు అధికార పార్టీ నేతల అండదండలు పలకడంతో వారికి అధికారులు సైతం మరింత ఆజ్యం పోస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇటీవల మున్సిపాలిటీకి కొత్తగా కాంట్రాక్టర్ లు రంగంలోకి దిగడం, అక్రమ నిర్మాణాలకు, ఇతర బహుళ అంతస్తు ల అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్లు, విచ్చలవిడిగా బోర్డింగ్ ల నిర్వహణ వంటి అనేక అంశాలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలదే కీ రోల్ గా మారిందని బహిర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. అంతెందుకు ఇటీవల కొంపల్లిలోని జయభేరిలో ఓ బహుళ అక్రమ వాణిజ్య షెడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అక్కడకు వెళ్లిన టౌన్ ప్లానింగ్ కిందిస్థాయి సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దానికి అధికార పార్టీ కి చెందిన ఓ నేత అండదండలే కారణంగా తెలిసింది. అధికారులు తమ పనులు తాము చేసుకుంటూ పోతే ప్రజలకు మరింత చేరువలో ఉండడమే కాకుండా మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందుతుందని, ఇకనైనా అధికారులు సమన్వయంతో సమయపాలనకు అనుగుణంగా తమ పరిపాలన సాగించాలని ప్రజలు కోరుతున్నారు.