Scooty Crash | దుండిగల్, జూన్ 28: రెప్పపాటు సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నతల్లి కండ్ల ముందరే ఓ చిన్నారి దుర్మరణం చెందిన హృదయ విదారక సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన రాజు రెడ్డి, నిహారిక దంపతులకు కొడుకు అభిమన్షు రెడ్డి (6), కూతురు ఉన్నారు.
రాజు కుటుంబం గత కొంత కాలం క్రితం ఉపాధి కోసం వలస వచ్చి నగర శివారు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధి, దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ ఆకాష్ లేఔట్లో స్థిరపడింది. రాజు రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, నిహారిక గృహిణి. అభిమన్షురెడ్డి బౌరం పేటలో గీతాంజలి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే అభిమన్షురెడ్డిని ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో స్కూల్‌కు తీసుకువెళ్లేందుకు తన స్కూటీపై కొడుకును కూర్చోబెట్టుకున్న నిహారిక ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరింది.
కొద్దిసేపటి అనంతరం స్కూటీ పల్లవి స్కూల్ వద్దకు రాగానే వెనుక నుంచి కంకర లోడుతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ (టీఎస్ 15 యు ఎఫ్ 4599) స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అభిమన్షు రెడ్డి రోడ్డుపై కుడివైపు పడిపోగా.. అతనిపై నుంచి టిప్పర్ లారీ టైర్లు దూసుకెళ్లాయి. దీంతో తల నుజ్జు నుజ్జై రెప్పపాటు సమయంలో అభిమన్షు రెడ్డి దుర్మరణం చెందాడు. కన్నుమూసి తెరిచేలోగా తన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఈ హృదయ విదారక దృశ్యం చూసే వాళ్లని సైతం కంటనీరు పెట్టించింది.
సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో నిహారిక సైతం గాయాలు కావడంతో చికిత్స కోసం ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
రోడ్డుపై బైఠాయించి స్థానికులు ఆందోళన…
చిన్నారి అభిమన్షు రెడ్డి రోడ్డు ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు కొద్దిసేపు అక్కడ ఆందోళన నిర్వహించారు. రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డును వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పల్లవి స్కూల్ వద్ద ప్రమాదం జరగడం ఇది రెండవసారి అని స్థానికులు పేర్కొన్నారు. అటుగా వచ్చే స్కూలు బస్సులు సైతం రోడ్డుపైనే నిలుపుతారని.. దీంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఈ ప్రమాదం జరిగిందన్నారు. స్కూల్ బస్సులను రోడ్లపై నిలుపకుండా చూడాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.