HCU Land Issue | ఉప్పల్, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు భూములను పరిరక్షించాలంటూ భారీ ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా ఈ వ్యవహారంపై స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా హెచ్‌సీయూ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై గళమెత్తుతున్న సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంజీవ్ నాయక్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. వన్యప్రాణులను సమాధి చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాచారంలో బుధవారం సంజీవ్ నాయక్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూమిని, వన్య సంపద, వన సంపదను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. హెచ్‌సీయూ భూములను కాపాడుకుంటామని.. హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.