మేడ్చల్, జూలై 4 : స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నట్టు అయింది. స్థానికుల కథనం ప్రకారం..మేడ్చల్ పట్టణంలోని హైటెక్ వ్యాలీ పాఠశాల బస్ శుక్రవారం ఉదయం దండుపల్లి, అంబర్‌పేట నుంచి మేడ్చల్‌కు వస్తుండగా డబిల్ పూర్ చౌరస్తా వద్ద లారీని వెనక నుంచి ఆకస్మాతుగా ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో పాఠశాల బస్సు వెనకాల ఉన్న కారు బస్సును ఢీ కొట్టగా, దానికి ఉన్న మరో కారు ఈ కారును ఢీ కొట్టింది.
ఈ ఘటనలో బస్సు కారు ముందు అద్దం పగిలిపోయింది. ఆ సమయంలో స్కూల్ బస్సులో దాదాపు 30 నుంచి40 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ముందు ఉన్న లారీ సడెన్ బ్రేక్ వేయడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పాఠశాల యాజమాన్యం మరో బస్సులో విద్యార్థులను పాఠశాలకు తరలించింది.