కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలో పారిశ్రామిక వేత్తలు విరివిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా..ప్రస్తుతం రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలతో భూములు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే, ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు క్రయవిక్రయాల్లేక.. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఈ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది ఉపాధి కరువై రోడ్డున పడుతున్నారు. కాగా, బీఆర్ఎస్ హయాంలో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతిఏటా రూ.వేల కోట్ల ఆదాయం సర్కార్‌కు సమకూరగా.. ప్రస్తుతం రూ.100 కోట్లు కూడా దాటడం లేదని సమాచారం.
Real Estate | రంగారెడ్డి, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : రియల్ ఎస్టేట్ రంగంలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి జిల్లా కాంగ్రెస్ సర్కార్‌లో కుదేలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు అధికంగా తరలిరావడంతో ఈ రంగంలో జిల్లా రారాజుగా వెలుగొందింది. అయితే ..15 నెలల కిందట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టే ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రంగంలో రూ. వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన అనేక మంది వ్యాపారులు క్రయవిక్రయాల్లేక తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. ఈ రంగాన్నే నమ్ముకున్న వేలాది మంది ఉపాధి కరువై రోడ్డున పడుతున్నారు.
కేసీఆర్ హయాంలో మన జిల్లా నుంచే సర్కార్‌కు ప్రతి ఏటా రూ. వేల కోట్ల ఆదాయం వచ్చేది. ప్లాట్లు, అపార్ట్మెంట్లు, భూముల క్రయవిక్రయాలకు జిల్లా పెట్టింది పేరుగా ఉండేది. అనేక ప్రాంతాల్లోని విల్లాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన అనేక మంది ప్రస్తుతం వాటిని తిరిగి అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే, బిల్డర్లు పెద్ద ఎత్తున నిర్మించిన అపార్ట్మెంట్లల్లోని ఫ్లాట్లు, విల్లాలు అమ్ముడు పోక బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులు కట్టలేక చేతులెత్తేస్తున్నా రు. ఇప్పటికే అమ్మకాలు, కొనుగోళ్ల కోసం చేసుకున్న ఒప్పందాలు సైతం నిలిచిపోవటంతో బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, జిల్లా లో 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా.. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా అధిక సంఖ్యలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగి రూ. 300 కోట్ల వరకు ఆదాయం సర్కార్‌కు సమకూరేది. కానీ, ప్రస్తుతం రూ.100 కోట్లు కూడా దాటడం లేదని సమాచారం.
నిలిచిన క్రయవిక్రయాలు..
బీఆర్ఎస్ హయాంలో పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట, శంకర్పల్లి వంటి పలు మున్సిపాలిటీల్లో బిల్డర్లు పెద్ద ఎత్తున విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని కొనేందుకు ఎవరూ ముం దుకు రాకపోవడంతో విక్రయాలు నిలిచిపోయా యి. అనేక నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అప్పులు తీసుకొచ్చి నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు అమ్ముడుపోకపోవడంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు అప్పుల పాలవుతున్నారు. పై ఉన్న మున్సిపాలిటీ ల్లో ఇప్పటికే రూ. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ రంగం ఢమాల్ కావడంతో రియల్ఎస్టేట్ బ్రోకర్లతోపాటు వ్యాపారులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యక్షంగా…పరోక్షంగా జిల్లా శివారులో సుమారు 50,000 మందికి పైగా ఈ రంగంపై ఆధారపడ్డారు. వారంతా ఉపాధిని కోల్పోయా రు. అనేక రియల్ ఎస్టేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. అదేవిధంగా ప్రీ లాంచింగ్‌లో భాగంగా ముందే డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న వా రు నేటికీ బిల్డర్లు అపార్ట్మెంట్లు, విల్లాలు అప్పగించకపోవడంతో లబోదిబోమంటున్నారు. గతం లో పైన పేర్కొన్న మున్సిపాలిటీల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయవిక్రయదారులతో కళకళలాడేది. నేడు వెలవెలబోతున్నాయి.
కుప్పకూలింది..
వికారాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నేవీ రాడార్ కేంద్రంతో రియల్ఎస్టేట్ మొత్తం కుప్పకూలింది. ఇక్కడి భూములను కొనేందుకు ముందుకొచ్చిన రియల్టర్లు.. రాడార్ కేంద్ర ఏర్పాటుకు జరిగిన శంకుస్థాపన విషయం తెలిసి చుట్టు పక్కన ప్రాంతాల్లోనూ భూములను కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఏడాది కిం దటి వరకు ఇక్కడ రూ. కోట్లు పలికిన భూములను సగం ధరకు అమ్ముతామన్న ఎవరూ కొనేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొన్నది. గతంలో భూములను కొనుగోలు చేసే చాలామంది ఫామ్‌హౌస్‌లు, మామిడితోటలకు పేరొందిన పూడూరు మండలంలోని భూములకే అధికంగా ప్రాధాన్యమిచ్చేవారు. నేవీ రాడార్ కేంద్రం ద్వారా వెలువడే రేడియేషన్ ప్రభావంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని, వివిధ దుష్పరిణామాలు ఉంటాయనే ప్రచారంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలింది. ఇప్పటికే భూములను కొన్న వారు అవి అమ్ముడుపోక.. చేసిన అప్పులు తీర్చలేక బలవ న్మరణాలకు పాల్పడుతున్నారు.
నాడు రూ. వేల కోట్లు.. నేడు రూ. వందల కోట్లు..
జిల్లాలో 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నా యి. ఈ ఆఫీసుల నుంచి కేసీఆర్ హయాంలో ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ. వేల కోట్ల రాబడి సమకూరేంది. ప్రతినెలా జిల్లా నుంచి రూ. 300-రూ. 400 కోట్ల వరకు ఆదాయం వచ్చే ది. ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయవిక్రయదారులతో కిటకిటలాడేవి. అయి తే.. రేవంత్ సర్కార్ తీసుకున్న చర్యలతో క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ప్రతినెలా ఆదాయం రూ. వందల కోట్లలోపే ఉంటున్న ది. జిల్లాలోనే అత్యధికంగా ఆదాయం సమకూ రే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, శంకర్పల్లి, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం వంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ క్రయవిక్రయాలు లేక వెలవెలబోతున్నాయి.
ఆదిబట్లలోనూ అంతంతే..
గతంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఆదిబట్ల పెట్టింది పేరుగా ఉండేది. ఈ మున్సిపాలిటీలో రియల్ఎస్టేట్ వ్యాపారులు వందల సంఖ్యలో ఉన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు వచ్చి టీసీఎస్ పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా లు అధిక సంఖ్యలో కొనేవారు. అయితే, రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో నేడు ఎవరూ అక్కడ భూములు, ఫ్లాట్లు కొనేందుకు ముందు రావడం లేదు. ఆదిబట్ల, మంగల్‌పల్లి, పటేల్‌గూడ, బొంగ్లూరు తదితర ప్రాం తాల్లోనూ ప్లాట్ల క్రయవిక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి.
– సంరెడ్డి మహిపాల్‌రెడ్డి
ఉపాధి కరువైంది..
నా స్వస్థలం కృష్ణా జిల్లా. హైదరాబాద్‌లో ఉంటున్నా. శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, యాచారం తదితర ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్లు, వ్యవసాయ భూములను మా జిల్లావాసులు.. తెలిసిన వారికి ఇప్పించి కమీషన్ తీసుకునేది. కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటు న్న చర్యలతో ఎవరూ భూములను కొనేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ఉపాధిని కోల్పోయా. నాతోపాటు చాలామంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారు కూడా రోడ్డున పడ్డారు.
-రమేశ్‌బాబు, హైదరాబాద్