కుత్బుల్లాపూర్, మార్చి1: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, మంచి నీటి సౌకర్యం, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందజేయాలని సూచించారు.
రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శనివారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్లు, కార్పొరేషన్, మున్సిపాలిటీలలోని వివిధ ప్రాంతాలలో గల మసీదులు, ఈద్గాల వద్ద మౌలిక వసతుల కల్పనపై బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద వివిధ విభాగాల ఉన్నతాధికారులు, మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ… మౌలిక వసతుల కల్పనలో భాగంగా నియోజకవర్గంలోని మసీదుల వద్ద ఏవైనా పనులు మిగిలిపోయినట్లైతే యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మల్లారెడ్డి, నరసింహ, ఈఈ కిష్టప్ప, లక్ష్మీ గణేశ్, వివిధ విభాగాల అధికారులు, ముస్లిం మత పెద్దలు, పలు డివిజన్ల అధ్యక్షులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.