KP Vivekananda | కుత్బుల్లాపూర్/దుండిగల్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అదే స్ఫూర్తితో గత పదేండ్లలో తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఈ నెల 27 వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవన సభ ఏర్పాట్లపై పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న వివక్ష నుంచి తప్పించుకోవచ్చని, అప్పుడు అభివృద్ధి సాధ్యమని నమ్మి కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో అవమానాలను తట్టుకుంటూ తెలంగాణ వాణిని వినిపించారని అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకై పాలకులతో కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. స్వరాష్ట్రాన్ని సాధించిన పదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమాలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లేలా అందరం సమన్వయం చేసుకుంటూ బయలుదేరి వెళ్లి చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.