Operation Kagar | జవహర్‌నగర్, మార్చి 2: ఆపరేషన్ కగార్ అప్రజాస్వామికమని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. మావోయిస్టు రహితంగా చేస్తామని చెబుతున్న బీజేపీ మొండి వైఖరిని విడనాడి.. వెంటనే కేంద్ర, రాష్ట్ర బలగాలను అడవుల్లో నుంచి వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. జవహర్‌నగర్‌లోని అంబేడ్కర్ ప్రధాన చౌరస్తాలో పీఓడబ్ల్యూ (విముక్తి) రాష్ట్ర నాయకురాలు సునీత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మతతత్వ, సామ్రాజవాద, కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా విద్వేషపూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసి మహిళలు, యువకులు, పిల్లలపై ఆధునాతన మరణాయుధాలతో యుద్ధానికి తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఎత్తివేస్తూ అడవుల్లో తిష్టవేసిన పారామిలటరీ బలగాలను వెనక్కి పిలవాలని డిమాండ్‌చేశారు.
మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పీఓడబ్ల్యూ(విముక్తి) రాష్ర్ట నాయకురాలు సునిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జాతీయ కార్యదర్శి షేక్ షావలి, నాయకులు కొన్నె వేణు, రషీద్, సిగరాయగౌడ్, యాకస్వామి, చంద్రన్న, ప్రసాద్, రాంరెడ్డి, యాదగిరి, విజయ్, శంకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.