Hyderabad | దుండిగల్, జూన్ 8: హైదరాబాద్‌లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపట్టాడు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే స్థానికులపైనే ఎదురుతిరుగుతున్నాడు. రాజకీయంగా అండదండలు ఉన్నాయని.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ రివర్స్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్‌లోని ని
వివరాల్లోకి వెళ్తే … నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని మజీద్ రోడ్డులో ఓ వ్యక్తి తనకు ఉన్న 100 గజాల స్థలంలో ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. అయితే మెట్ల నిర్మాణం కోసం సుమారు ఐదు ఫీట్ల రోడ్డు స్థలాన్ని ఆక్రమించి పిల్లర్లు వేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని నిలదీయగా సదరు వ్యక్తి వారికి ఎదురుదిరిగాడు. నా ఇష్టం.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ స్థానికులపైనే రివర్స్‌లో వాగ్వాదానికి దిగాడు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంతవరకైతే నిర్మాణం ఉందో అంతవరకే నిర్మాణం చేపడితే ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ తమ మాట పెడచెవిన పెట్టి ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు ఎటువంటి భయం లేదని నిర్మాణదారులు పేర్కొనడంతో బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై చేపట్టిన నిర్మాణాన్ని తొలగించాలని కోరుతున్నారు.