Pet Basheerabad | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 6: మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధిలో ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న నలుగుర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి మరణించగా.. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని కినాల గ్రామానికి చెందిన షేక్ అయూబ్ (35) బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉంటూ అక్కడే విల్లాలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పని ముగించుకుని తన స్నేహితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోషన్ గుప్తా, రవి గుప్తా, శివకాంత్లతో కలిసి ఎవరి ఇంటికి వాళ్లు బయల్దేరారు. వారు నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో చర్మాస్ షోరూం దగ్గర వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఆ నలుగుర్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో షేక్ అయూబ్ తీవ్రంగా గాయపడగా.. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో షేక్ అయూబ్‌ను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో అయూబ్ మరణించాడు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.