మేడ్చల్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగిలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ఇంకో వారం రోజులు పట్టేట్టు కనిపిస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదురుచూడకముందే ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారా అని ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ధాన్యం మొదటికి రకానికి క్వింటాల్‌కు 3,229, రెండో రకానికి 2,300 ధరను ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే సన్న బియ్యానికి మాత్రం రూ. 500 బోనస్‌ను అందించనున్నారు. గత సీజన్లో సన్న వడ్లకు మాత్రమే బోనస్ అందించడం, అది కూడా ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాసంగి సీజన్లో సన్న వడ్లను విక్రయించిన రైతులకు బోనస్‌ను తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్పట్లో ఎదురుచూడకుండానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: డీసీఎంస్ వైస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదురుచూడక ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చేలా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక పక్బందీంగా సిద్ధం చేసి అధికారులు అమలు చేసేలా చర్యలు తీసుకునేవారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రైతులకు రాకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించేవారు. రైతులు ఎదురు చూడక ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో వరి కొతలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.