Indiramma Illu | మేడ్చల్, జూన్8(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులు జరిగేలా విచారణ చేయనున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఎంపిక చేసిన 216 మంది లబ్ధిదారుల్లో అర్హులు కాని కాంగ్రెస్ నాయకులు, అనుచరులు, బంధుమిత్రులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏకంగా మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకుల పెత్తనం ఉండటం వల్లే అర్హులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న క్రమంలో ఇక్కడే దీనికి ఫుల్స్టాప్ పెట్టేలా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
ఇప్పుడు ఇలా ఉంటే ముందు ముందు ఎలా
ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపులో కాంగ్రెస్ నాయకుల జోక్యం ఉంటే ముందు ముందు ఎలా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పూర్తి స్థాయిలో ఇంకా ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం కాకుండానే కాంగ్రెసోళ్లకే పథకాలను వర్తింపజేస్తే పరిస్థితి ఏమిటని దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలు ఉండగా ఇందులో మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైన విషయం విదితమే. మూడు నియోజకవర్గాలలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ నాయకుల జోక్యం ఉంటే ఈ పథకం నీరుగారి పోనుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక కాంగ్రెస్ నాయకులు జోక్యం లేకుండా చూడాల్సిన అవసరం అధికారులకు ఉందని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1.42 లక్షల దరఖాస్తులు రాగా మరికొందరు ఇప్పటికే ఇంకా దరఖాస్తులను ఇస్తూనే ఉన్నారు. మొదటి విడతలో మాత్రం నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లక్షలో వచ్చిన దరఖాస్తుదారులకు ఏ మేరకు ఇందిరమ్మ ఇండ్లను వర్తింపజేస్తారన్నాది ప్రశ్నర్థకరంగా మారింది.