Quthbullapur Circle Office | కుత్బుల్లాపూర్, జూన్ 11 : నిత్యం అధికారులు, సిబ్బందిచ ప్రజలతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. గత కొన్ని రోజుల నుండి కార్యాలయానికి వచ్చిపోయే ప్రజలతోపాటు సిబ్బందికి కార్యాలయంలో ఉండే రికార్డులు, విలువైన పత్రాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. కార్యాలయం ఆవరణలో మొదటి అంతస్తులో టాక్స్ విభాగంలో పనిచేసే సిబ్బంది, అధికారులు కూర్చున్న చోట పూర్తిగా రికార్డులు, విలువైన పత్రాలు భద్రత లేకుండా విచ్చలవిడిగా పడి ఉండడంతో అధికారుల పనితీరు పట్ల అద్దం పట్టినట్లు కనిపిస్తుంది.
కార్యాలయంలో ప్రజలకు కావాల్సిన పలు పత్రాలు, ఇతర కార్యాలయ రికార్డులు భద్రపరచాల్సిన చోటు నిర్వహణను అధికారులు మరవడంతో ఎక్కడపడితే అక్కడ కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయి. దీంతో ఎలుకలు, పిల్లులు అధికమై ఇప్పటికే పలు పత్రాలు ఇతర రికార్డులు ధ్వంసం కావడం ఇక్కడ పరిపాటిగా మారింది. స్టేషనరీ, ఇతర వస్తువులను భద్రపరచుకునేందుకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో కార్యాలయం నిర్వహణ పూర్తిగా అధికారుల బాధ్యత రాహిత్యానికి దర్శనమిస్తుందని విమర్శలు లేకపోలేదు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణలు ఉన్నా..
నిత్యం సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలు ఉన్నప్పటికీ నిర్వహణ మాత్రం ఇలా వ్యర్ధంగా దర్శనం ఇవ్వడం గమనార్హం. కార్యాలయంలో ప్రతీ విభాగంలో అధికారులకు సిబ్బందికి కావాలసిన వివిధ మౌళిక సదుపాయాలు, ఇతర మార్పులు చేర్పులు కల్పించేందుకు నిత్యం ఉప కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇందుకు నిదర్శనమని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
డీసీ తన కార్యాలయం గది తప్ప ఇతర గదుల నిర్వహణపై ఏ రోజు కూడా ఆరా తీయకపోవడమే దీనికి ప్రధాన కారణమని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కార్యాలయంలో బాధ్యతను మరిచిన అధికారుల పనితీరుతోపాటు ప్రజలకు సంబంధించిన విలువైన రికార్డులు, ఇతర పత్రాలను పదిలంగా ఉంచేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు