పైపులైన్ లీకేజీతో మంచినీటిలో కలుస్తున్న మురుగునీరు
మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 11 : అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామ ప్రజలు శుద్ధ జలాలనికి బదులుగా అశుద్ధమైన జలాన్ని తాగుతున్నారు. పైపులైన్ లీకేజీతో మంచినీటిలో మురుగునీరు చేరి కలుషితమవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్లో పలు చోట్ల పైపులైన్ లీకేజీలు జరిగి తాగునీటిలో మురుగునీరు చేరి నల్లాల ద్వారా ప్రజలకు అశుద్ధమైన జలం చేరుతుంది. ప్రధానంగా వల్లంపట్లకు వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న మురుగు కాల్వ వద్ద మంచినీళ్ల పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో మురుగు కాల్వలోని మురుగు నీరంతా మంచినీళ్ల పైపులైన్లో చేరుతుంది. గత కొన్నాళ్లుగా మంచినీరు కలుషితమవుతున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షకాలం ప్రారంభమవుతుండడంతో కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలుకానున్నారు. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తక్షణమే స్పందించి, సదరు పైపులైన్ లీకేజీని సరిచేసి గ్రామస్తులకు శుద్ధమైన మంచినీళ్లు అందజేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.