BRK Bhavan | హైదరాబాద్ : బీఆర్కే భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. ఇక కేసీఆర్ విచారణకు రావడంతో.. పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పైకి కొంత మంది ఫొటో జర్నలిస్టులు వెళ్లి.. బీఆర్కే భవన్ ముందున్న పరిస్థితిని కవరేజ్ చేసేందుకు వెళ్లారు. ఫొటోలు తీస్తుండగా.. ఫ్లై ఓవర్‌పై ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్లు.. జర్నలిస్టులను అడ్డుకున్నారు. ఇక్కడ్నుంచి ఫొటోలు తీయొద్దని ఫొటో జర్నలిస్టులను ఆదేశించారు. ఫొటోలు తీస్తే తప్పేంటని జర్నలిస్టులు ప్రశ్నించగా.. వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై ఫొటో జర్నలిస్టులు మండిపడ్డారు.