Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది. ఇంకా 27 నౌకలు ఇంకా ఈ జలసంధి మార్గంలో చిక్కుకున్నాయి. ఈ నౌకల్లో ఇంకా 700 మందికిపైగా సిబ్బంది చిక్కుకుపోయారు. ఈ వివరాల్ని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇండియా నౌకలతోపాటు అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయాయి.
ఈ అంశంపై కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కే సిన్హా ఈ అంశంపై ప్రకటన చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హోర్ముజ్ జలసంధి మార్గంలో ఉన్న భారత నౌకల భద్రత గురించి కేంద్రం పర్యవేక్షిస్తోంది. ఇండియాకు చెందిన ఒక నౌక శుక్రవారమే ఈ మార్గాన్ని దాటింది. అయితే, ఈ నౌక జలసంధికి తూర్పు వైపు ఉండటం వల్ల ప్రధాన మార్గం నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ నౌక ఇండియాకు రావడం లేదు. ఆఫ్రికాకు వెళ్తోంది. ప్రతి భారతీయ నౌక గురించి ప్రభుత్వం సమీక్షిస్తోంది. హోర్ముజ్ జలాల్లో మొత్తం 27 ఇండియన్ నౌకలున్నాయి. వాటిలో పశ్చిమ ప్రాంతం వైపు 24 నౌకలు, వాటిలో 677 మంది సిబ్బంది ఉన్నారు. తూర్పు వైపు నాలుగు నౌకలు ఉండగా, ఒకటి ఈ ప్రాంతాన్ని దాటింది. దీంతో ఇక్కడ మూడు నౌకలు చిక్కుకుపోయాయి.
వీటిలో 76 మంది వరకు ఉన్నారు. గల్ఫ్ సముద్ర తీరాల్లో నిత్యం 23,000 మంది భారతీయులు నౌకల్లో పని చేస్తుంటారు. వీరంతా వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు భారతీయులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు రాజేష్ కే సిన్హా తెలిపారు. పశ్చిమాసియాలోని వివిధ దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.