బాలానగర్, మే 31 : పురుడు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ విగత జీవిగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు తల్లి సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రభుత్వ దవాఖానాలో అప్పుడు పుట్టిన శిశువుతో పాటు బాలింత సైతం ప్రాణాలు కోల్పోయింది. తల్లీబిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలానగర్ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి కి చెందిన అరుణ (22) కాన్పు చేయించు కోవడం కోసం కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేస్‌లో నివాసముండే తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది.
శనివారం డెలివరీ నిమిత్తం బాలనగర్ డివిజన్ వినాయకనగర్‌లోని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. కాగా, అరుణకు ఆరోగ్య కేంద్రంలో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది డెలివరీ చేశారు. ఆ వెంటనే అరుణ బెడ్‌పై పడిపోయింది. వెంటనే ఆమెను 108 లో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అరుణ మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. అదేవిధంగా అరుణకు జన్మించిన మగ బిడ్డ ఆరోగ్యం కూడా సక్రమంగా లేకపోవడంతో నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరుణ కుటుంబ సభ్యులు బాలనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే తల్లీబిడ్డల మృతి కారణమని బంధువులు ఆరోపించారు. ఈ మేరకు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.